‘చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలి’

28 Sep, 2018 16:22 IST|Sakshi
తాండూరులో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య 

బీసీలను గెలిపించండి

బలహీనవర్గాలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య 

తాండూరు టౌన్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆ సంఘం నియోజకవర్గ కన్వీనర్‌ రాజ్‌కుమార్‌ అధ్యక్షతన గురువారం తాండూరులో బీసీ యువగర్జన నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అణగారిన వర్గాలుగా బతుకుతున్న బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలన్నారు. చట్టసభల్లో బీసీల ఆధిక్యం పెరగాలంటే 50శాతం రిజర్వేషన్లు కేటాయించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్‌లను స్తంభింపజేస్తామని హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో సైతం 119 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 19 మంది మాత్రమే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. 52 శాతం ఉన్న బలహీనవర్గాలు రాజ్యాధికారంలో మాత్రం వెనుకబడిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అగ్రవర్ణాల కబంధ హస్తాల నుంచి బయటపడి, ఐకమత్యంతో ఎన్నికల్లో ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకుని బీసీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కనిపించని వివక్ష కింద బీసీలు బతుకుతున్నారన్నారు. కుల సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలు వణుకుతున్నాయని, ఐక్యంగా ఉంటే బలోపేతమవుతామని స్పష్టంచేశారు. వేషం, భాష, నడక, నడత అన్నీ మార్చినట్లయితే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని సూచించారు. గతంలో అగ్రవర్ణాల వారు బీసీలకు రిజర్వేషన్లు ఎత్తేయాలని సుప్రీంకోర్టులో కేసు వేసి ఇంకా అణగదొక్కాలని చూశారని మండిపడ్డారు.

సీ విద్యార్థుల సంక్షేమాన్ని మరిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చుక్కలు చూపించి విద్యార్థులకు కేటాయించాల్సిన స్కాలర్‌షిప్‌లు, బాల, బాలికలకు వసతి గృహాలు, ఇతర సౌకర్యాలు మెరుగుపరిచేలా పోరాటం చేశామని తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని చెప్పారు. అనంతరం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సునీతాసంపత్‌ మాట్లాడుతూ.. అన్ని బీసీ కులాలు ఏకమై అగ్రవర్ణాల ఎత్తుగడలను తిప్పి కొట్టాలన్నారు. రాజకీయాల్లో బీసీలు ఎదిగేందుకు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల, కుల సంఘాల నాయకులు రవిగౌడ్, వడ్డే శ్రీనివాస్, పట్లోళ్ల నర్సింలు, పటేల్‌ రవిశంకర్, రమేష్‌కుమార్, ఇందూరు రాములు, నరేష్‌ మహరాజ్, మురళీకృష్ణ గౌడ్, పూజారి పాండు, ప్రభాకర్‌గౌడ్, బసయ్య, కమల, భద్రేశ్వర్, సౌజన్య, మాధవి, శ్రీనివాస్, షుకూర్, తారకాచారి, వెంకటేష్‌చారి, దత్తు తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు