‘ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’

18 Aug, 2017 19:00 IST|Sakshi
‘ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి’

► ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య లేఖ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని శాసనసభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 1.20లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ప్రకటించడం హర్షనీయమని, కానీ ప్రకటించిన ఖాళీల్లో స్పష్టత లేదన్నారు. దీంతో నిరుద్యోగుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని, శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను పేర్కొంటూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటు తర్వాత భర్తీ చేసిన పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్లు, ఆర్డీఓ కార్యాలయాలు ఏర్పాటు చేశారని, వాటిల్లో అధికారులు, ఉద్యోగులు లేక ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయన్నారు. సేవలందిలంచే అధికారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొత్త జిల్లాలు, ఆర్డీఓ కార్యాలయాలు, పోలీస్‌ స్టేషన్లలో కొత్తగా భర్తీ చేసిన, ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను వెల్లడించాలన్నారు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీకి ఎంత సమయం పడుతుందో తెలపాలని, ఎన్ని పోస్టులు పదోన్నతులతో భర్తీ చేస్తారో, నేరుగా నియామకాల ద్వారా ఎన్నింటిని భర్తీ చేస్తారో తెలపాలన్నారు. ఈమేరకు శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు.

మరిన్ని వార్తలు