10 జిల్లాల్లో మొదలుకాని రబీ సాగు 

2 Nov, 2017 02:41 IST|Sakshi

ప్రభుత్వానికి నివేదించిన వ్యవసాయ శాఖ

సాక్షి, హైదరాబాద్‌:  రబీ సీజన్‌ మొదలై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ పంటల సాగు ఊపందుకోలేదు. పది జిల్లాల్లోనైతే అసలు ఒక్క ఎకరాలో కూడా పంటల సాగు మొదలు కాలేదు. మేడ్చల్, మెదక్, నల్లగొండ, యాదాద్రి, జయశంకర్, మహబూబాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో రబీ పంటల సాగు మొదలు కాలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో వెల్లడించింది. రబీ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31.80 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.67 లక్షల ఎకరాల్లో సాగు కావాలి. గతేడాది ఇదే సమయానికి 3.45 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు కేవలం 2.47 లక్షల ఎకరాలకే (8%) సాగు పరిమితమైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. అందులో ఆహారధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 23.7 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 87,500 ఎకరాల్లోనే (4%) సాగయ్యాయి.

పప్పు ధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 3.15 లక్షల ఎకరాలు కాగా, 72,500 ఎకరాల్లో (23%) సాగయ్యాయి. శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.27 లక్షల ఎకరాలైతే, 67,500 ఎకరాల్లోనే (29%) సాగైంది. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.77 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 1.47 లక్షల ఎకరాల్లో (39%) సాగుచేశారు. వరి రబీ సాధారణ సాగు విస్తీర్ణం 15.1 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు ఇంకా నాట్లు మొదలు కాలేదు. పత్తిని ఇంకా గులాబీరంగు పురుగు పట్టిపీడిస్తోందని వ్యవసాయశాఖ వెల్లడిం  చింది.  వరంగల్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నాగర్‌కర్నూలు, గద్వాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో గులాబీ కాయతొలుచు పురుగుతో పత్తి పరిస్థితి అధ్వానంగా ఉంది. 

మరిన్ని వార్తలు