సీఎల్పీ రేసులో ఉన్నా..!

13 Jan, 2019 04:13 IST|Sakshi

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు:  తాను సీఎల్పీ రేసులో ఉన్నానని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా మునుగోడులో శనివారం  కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎల్పీ పదవి అప్పగిస్తే ప్రభుత్వంపై గట్టిగా పోరాడతానని పేర్కొన్నారు. అయితే.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తనకు పీసీసీ బాధ్యతలు అప్పగించి ఉంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్లు కేటాయించి 100 సీట్లలో గెలిపించేవాడినని వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నియంత వైఖరి వల్ల తాను ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు నెలరోజులైనా కనీసం ప్రమాణ స్వీకారం చేయలేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.

సీఎం ఒంటెత్తు పోకడలకు అడ్డుకట్ట వేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ నేత ఎంపికకు సన్నద్ధమైందని తెలిపారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన ఆలస్యం వల్లే రాష్ట్రంలో ప్రజా కూటమి ఓటమిపాలైందని ఆయన అభిప్రాయపడ్డారు.  సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలతో పొత్తు కుదరక మూడు నెలల పాటు చర్చలు జరపడంతో అభ్యర్థుల ఎంపిక చాలా ఆలస్యమైందని పేర్కొన్నారు. అదే టీఆర్‌ఎస్‌ రెండు నెలల ముందే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి గ్రామాల్లో ఓటర్లని ప్రసన్నం చేసుకొని అధికస్థానాలు గెలవగలిగిందని వెల్లడించారు. అన్ని రోజులు కొట్లాడి అనుకున్న స్థానాలు తీసుకున్న సీపీఐ, జన సమితి పార్టీలు కనీసం ఒక సీటు కూడా గెలవకపోవడం విచారకరమన్నారు. 

మరిన్ని వార్తలు