చెప్పం.. చేసి చూపిస్తాం!

18 Nov, 2018 18:34 IST|Sakshi
ప్రసంగిస్తున్న బీవీ రాఘవులు 

డబ్బుకు, త్యాగానికి మధ్యే పోటీ

గాంధీ సాక్షిగా బజారుపాలైన వారికి ఓటు వేయొద్దు

బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులను గెలిపించండి

సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు రాఘవులు పిలుపు

నామినేషన్‌ వేసిన పుట్ట మల్లికార్జున్‌

సాక్షి, కామారెడ్డి : ప్రజల కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి త్యాగం చేసిన వ్యక్తికి.. డబ్బు, అవినీతిపరుల మధ్య కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ జరుగుతోందని, త్యాగం చేసిన వారినే గెలిపించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు. తాము అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పమని, చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం కామారెడ్డి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ పుట్ట మల్లికార్జున్‌ నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన ఆయన వీక్లీ మార్కెట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. గంజ్‌లో గాంధీ విగ్రహం సాక్షిగా పరువు తీసుకుని బజారు పాలైన వ్యక్తులకు ఓటు వేయవద్దని, నిజాయతీపరుడైన బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఓట్లు మనవి రూ.కోట్లు వాళ్లవి అని ఎద్దేవా చేశారు. సామాజిక న్యాయం, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం, ప్రజా సేవ కోసం ఒక్క సారి తమకు అవకాశం ఇవ్వాలన్నారు. కామారెడ్డిలో 54 వేల మంది బీడీ కార్మికులుంటే వారి సంక్షేమ కోసం కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు ఆలోచించాయా? అని ప్రశ్నించారు. ఇక్కడ బీడీ కార్మికులకు ఇళ్ల కట్టించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని, భూ కబ్జాదారులను, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను, కాంట్రాక్టర్లనే పట్టించుకున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రత్యామ్నాయం గా బీఎల్‌ఎఫ్‌కు ఓటువేసి గెలిపించాలని కోరారు.
రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తాం 
బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర స్వరూపాన్ని మారుస్తామని రాఘవులు తెలిపారు. 30 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో, తొమ్మిదేళ్ల టీడీపీ, నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం వెనకబడిందన్నారు. అంతేకాక నాయకులు రంగులు మారుస్తున్నారే తప్ప రాష్ట్రం, ప్రజల తలరాతను మార్చడం లేదని.. అందుకోసం బీఎల్‌ఎఫ్‌ పోటీలోకి వచ్చిందన్నారు. అవకాశం ఇస్తే రాష్ట్రాన్నే మార్చి చూపుతామన్నారు. అనంతరం వీక్లీ మార్కెట్‌ నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి పుట్ట మల్లికార్జున్‌ నామినేషన్‌కు భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషనల్‌ పత్రాలు అందజేశారు.  
పోలీసులతో వాగ్వాదం 
నామినేషన్‌ వేయడానికి కార్యాలయానికి వెళ్తుండగా, పోలీసులు రాఘవులును, ఎంసీపీఐయూ జాతీయ కార్యదర్శి గౌస్, అభ్యర్థి మల్లికార్జున్‌ తదితరులను అడ్డుకున్నారు. మెడలో వేసుకున్న పార్టీల కండువాలు తీసేసి, లోపలికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో రాఘవులు 15 నిమిషాల పాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము ఎర్రరంగు చొక్కాలను వేసుకుని వస్తే, వాటిని కూడా విప్పించేస్తారా? అని పోలీసులపై అగ్రహం వ్యక్తం చేశారు. తాను 6 నియోజవర్గాలలో నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నానని, ఎక్కడా అడ్డుకోలేదని, ఇక్కడ మాత్రం ఏమిటని ప్రశ్నించారు. 
నిన్న, మొన్న ఇతర పార్టీల వారు కండువాలతో వెళితే పట్టించుకోలేదని, తమను మాత్రం అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. ఏ చట్టం ప్రకారం లోనికి పంపించరో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అధికారితో చెప్పించాలని కోరారు. కొద్దిసేపటి తర్వాత కామారెడ్డి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అక్కడ ఉన్న సీఐ ఫోన్‌ చేసి, రాఘవులుతో మాట్లాడించారు. దీంతో బీఎల్‌ఎఫ్‌ నేతలు మెడలోని కండువాలను తీసి, నామినేషన్‌ వేయడానికి లోపలికి వెళ్లారు.

మరిన్ని వార్తలు