‘ఆ సభ కోసం దేశం ఎదురుచూస్తోంది’

26 Nov, 2018 12:21 IST|Sakshi
సభ ఏర్పాట్లును పరిశీలిస్తు‍న్న భట్టి-నామా

 ఈ నెల 28న ఖమ్మంలో మహాకూటమి భారీ బహిరంగ సభ

రాహుల్‌, చంద్రబాబు, కోదండరాం, సీపీఐ జాతీయ నేతలు హాజరు

చరిత్రలో నిలిచిపోయే సభ : భట్టి, నామా

సాక్షి, ఖమ్మం : దేశ చరిత్రలో నిలిచిపోయే సభకు ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా వేదిక కాబోతుందని ప్రజా కూటమి నేతలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 28న కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్న విషయం తెలిసిందే. సభ జరిగే ప్రాంతాన్ని సోమవారం  మల్లు భట్టి విక్రమార్క, నామా నాగేశ్వరరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం సభ రాష్ట్రానికే కాదు దేశానికి దిశానిర్ధేశం చేయనుందని అన్నారు. మతతత్వ బీజేపీని తరిమికొట్టేందుకు ఖమ్మం నుంచి శంఖారావం పూరిస్తామని వ్యాఖ్యానించారు. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ఖమ్మం గుమ్మం కానుందని, ఈ సభలో కోదండరాంతో సహా, సీపీఐ జాతీయ నేతలంతా పాల్గొంటారని భట్టి వెల్లడించారు.

ఇద్దరు జాతీయ నేతల సందేశం కోసం దేశం ఎదురుచూస్తొందని  ఖమ్మం మహాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. దేశంలో సెక్యూలరిజంను కాపాడేందుకు మహాకూటమి ప్రయత్నిస్తుందని తెలిపారు. నాలుగు పార్టీలకు చెందిన నేతలంతా సభలో పాల్గొంటారని, వచ్చే ఎన్నికల్లో కూటమిదే విజయమాని నామా ధీమా వ్యక్తం చేశారు. కాగా తెలంగాణలో రాహుల్‌​ పర్యటన నిమిత్తం కాంగ్రెస్‌ పార్టీ ఇదివరకే ప్రచార షెడ్యూల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కొడంగల్‌, వికారాబాద్‌తో సహా పలు సభల్లో రాహుల్‌ పాల్గొననున్నారు.

>
మరిన్ని వార్తలు