భూపాలపల్లి : ప్రజల కలలను సాకారం చేస్తాం..

30 Nov, 2018 09:25 IST|Sakshi
మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ, వేదికపై నాయకులు

ప్రతి పంటకూగిట్టుబాటు ధర కల్పిస్తాం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

 ఫాంహౌస్‌లో ఉంటానన్న సీఎంను ఇక పిలవొద్దు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం 

సాక్షి, భూపాలపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధి కారంలోకి వస్తుంది.. ఆ వెంటనే తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి సీఆర్‌నగర్‌లో మాజీ చీఫ్‌ విప్, కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏర్పడిన టీఆర్‌ఎస్‌ సర్కారు తన మేనిఫెస్టోలో పొందుపరిచిన ఏఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. తమ ప్రభుత్వం రాగానే జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని, పోడుదారులందరికీ పట్టాలు అందజేస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్రం ఏమిటో తనకు తెలు సని, వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయడంతోపాటు డిపెండెంట్‌ ఉద్యోగాలు, డిస్మిస్డ్‌ కార్మికులకు ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పారు. కార్మికుల పిల్లలకు ఉచితంగా మెరుగైన విద్య, వైద్యం అందిస్తామన్నారు.

రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేయడమే కాకుండా పత్తికి రూ.7వేలు, ధాన్యానికి రూ. 2వేలు, మిర్చికి రూ.10వేలు మద్దతు ధర ఇవ్వడంతోపాటు మొత్తం 17 పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ప్రతి మండలానికి 30 పడకలు, నియోజకవర్గానికి వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చా రు. కార్మికులు, యువత, గిరిజనులు, మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని రాహుల్‌ గాంధీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ మంత్రి విజయరామారావు, డీసీసీ అధ్యక్షు డు నాయిని రాజేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్ర జ్యోతి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చాడ రఘునాథరెడ్డి, నాయకులు దొమ్మాటి సాంబయ్య, ఆరోగ్యం, హుస్సేన్, బుర్ర రమేష్, చల్లూరి సమ్మయ్య, కటకం జనార్ధన్, గడ్డం కుమార్‌రెడ్డి, నూనె రాజు, ఆకుల మల్లేష్, మాదాసు తిరుపతమ్మ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో కూటమి సర్కారే..
కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ తప్పనిసరిగా అమలు చేస్తాం. డిసెంబర్‌ 11న రాష్ట్రంలో ఏర్పడేది మహా కూటమి ప్రభుత్వమే. కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి కార్మికులను తీవ్రంగా మోసం చేసింది. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో వారిదే కీలక పాత్ర. జిల్లాలోని పోడు భూములను సీఎం కేసీఆర్‌ లాక్కునేందుకు ప్రయత్నించాడు.  – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

కుటుంబ పాలనకు అంతం తప్పదు..
ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఓడిపోతే ఫాంహౌస్‌ కు వెళ్తానని ప్రకటించిన ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ను ఇక ప్రజలు పిలవాల్సిన అవసరం లేదు. త్వరలోనే కుటుంబ పాలనకు అంతం తప్పదు. నాలుగున్నర ఏళ్లలో ఆదివాసులు తీవ్రంగా కష్టపడ్డారు. వారి సమస్యలను ప్రభుత్వం, అటవీశాఖ అధికారులు పట్టించుకోలేదు. కౌలుదారులంటే రైతు లు కాదన్నట్టుగా తెలంగాణ సర్కారు వ్యవహరించింది. మహాకూటమి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి కొల్లగొట్టిన వాటిని వెనక్కి తీసుకొస్తాం. 50 నెలల పాలనలో ఒక్క సమస్య కూడా పరిష్కరించని కేసీఆర్‌ ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతూ అన్నీ చేస్తానని అంటున్నాడు.. ఆయన మాటలను ప్రజలు నమ్మవద్దు. మహాకూటమి అభ్యర్థులను గెలిపించి తెలంగాణ భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలి. – కోదండరాం, టీజేఎస్‌ అధ్యక్షుడు 

నేను చేసిన అభివృద్ధే..
భూపాలపల్లి నియోజకవర్గంలో తన పదవీకాలంలో చేసిన అభివృ ద్ధే కనిపిస్తున్నది. కుగ్రామంగా ఉన్న భూపాలపల్లికి బస్‌డిపో తీసుకువచ్చాను. ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు మంజూ రు చేయించాను. గ్రామ పంచాయతీగా ఉన్న భూపాలపల్లిని నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ చేయించాను. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఒక బోర్డు తగిలించిందే తప్ప చేసిందేమీ లేదు. స్పీకర్‌ మధుసూదనాచారి ఓటమి భయంతో నాపై ఆరోపణలు చేస్తున్నారు. నేను గెలిస్తే భూపాలపల్లి జిల్లా ఉండదని దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆయన మాటలను ప్రజలు నమ్మవద్దు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పట్టణంలో మెడికల్, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఏర్పాటు చేయిస్తాను. భూపాలపల్లికి ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మిస్తాను. అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించండి.   
 – గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్‌ భూపాలపల్లి అభ్యర్థి

సభ సైడ్‌లైట్స్‌..

  • ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సభకు ఉదయం 10 గంటల నుంచే ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు రావడం ప్రారంభించారు. 
  • తొలుత భూపాలపల్లి, వరంగల్, పరకాల, మంథని పట్టణాలకు చెందిన కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు ప్రసంగించారు. 
  • మధ్యాహ్నం 12.50 గంటలకు రాహుల్‌ ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా భూపాలపల్లి పట్టణంలోని సీఆర్‌నగర్‌ వద్దకు చేరుకున్నారు. 
  • 12.59 గంటలకు రాహుల్‌ సభావేదిక పైకి వచ్చి ప్రజలకు అభివాదం తెలిపాడు. 
  • రాహుల్‌ ప్రసంగం మధ్యాహ్నం 1.21 ప్రారంభమై 1.50 గంటలకు ముగిసింది. 29 నిమిషాల పాటు ప్రసంగం కొనసాగింది. 
  • రాహుల్‌ హిందీలో ప్రసంగించగా మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలుగులోకి అనువదించారు. 
  • బహిరంగ సభ మొత్తంగా గంటన్నరకు పైగా కొనసాగింది. 
>
మరిన్ని వార్తలు