నేడు రాష్ట్రంలో రాహుల్‌ పర్యటన

9 Mar, 2019 02:30 IST|Sakshi

ఎన్నికల సమరశంఖం పూరించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పార్లమెం టు ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ స్థాయిలో ఎన్నికల సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ కూడా శంషాబాద్‌ సభతో రంగంలోకి దిగనుంది. శనివారం జరిగే ఈ సభతో కాంగ్రెస్‌ కూడా పార్లమెంటు ఎన్నికల సమరానికి పార్టీ అధినేతతో సమరశంఖం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులతో తీవ్ర నైరాశ్యం ఆవహించిన నేతల్లో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో అగ్రనేతలు, కార్యకర్తల్లో జోష్‌ నిండుతుందని పార్టీ విశ్వాసంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటరీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, ఇవి జాతీయ స్థాయి సమస్యలతో ముడిపడి జరిగే ఎన్నికలు కాబట్టి, వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిచి తన సత్తా చాటాలని కాంగ్రెస్‌ పార్టీ వ్యూహరచన చేస్తోంది. 

రాహుల్‌ షెడ్యూల్‌ ఇదీ.. 
శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌కు వెళతారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు క్లాసిక్‌ కన్వెన్షన్‌ పక్కన ఉన్న మైదానంలో నిర్వహించే కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. సాయంత్రం 6.30 గంటల తరువాత సభ నుంచి తిరిగి ఎయిర్‌పోర్టుకు బయల్దేరతారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళతారు.

మరిన్ని వార్తలు