నేరడిగొండలో రాహుల్‌ సభ

14 Oct, 2018 07:53 IST|Sakshi
నేరడిగొండలో బహిరంగ సభ కోసం స్థలాన్ని చదును చేయిస్తున్న జాదవ్‌అనిల్‌కుమార్‌

సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఘన స్వాగతం పలకాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. నేరడిగొండలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగసభకు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా నుంచి 2లక్షలకు పైగా జనాన్ని సమీకరించాలని ఆ పార్టీ నాయకులు నిర్ణయించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తథ్యం అనే రీతిలో సభను నిర్వహించాలని పీసీసీ నుంచి ఆదిలాబాద్‌ డీసీసీకి ఆదేశాలు జారీ అయ్యాయి.

శుక్రవారం నేరడిగొండలో సభ నిర్వహణను నిర్ధారించిన ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్, పీసీసీ వర్కింగ్‌  ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అనంతరం నిర్మల్‌లో ఉమ్మడి జిల్లా నాయకులతో సమావేశమై దిశానిర్ధేశం చేశారు. నేరడిగొండ సభ ద్వారా టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుందో రాహుల్‌గాంధీ స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేలా సభను నిర్వహించాలని ముఖ్య నేతలు జిల్లాల నాయకులకు స్పష్టం చేశారు. నేరడిగొండలో బహిరంగ సభ కోసం స్థలాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జాదవ్‌ అనిల్‌కుమార్‌ చదును చేయిస్తున్నారు.

పీసీసీ నుంచి సమన్వయకర్తలు
రాహుల్‌గాంధీ పాల్గొనే బహిరంగ సభ కోసం నియోజకవర్గాల వారీగా పీసీసీ నుంచి సమన్వయకర్తలను నియమించారు. పార్టీ సీనియర్‌ నాయకులు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తూ మండల, నియోజకవర్గ నాయకులకు జన సమీకరణ బాధ్యతలు అప్పగిస్తారు. నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులు జనాన్ని సమీకరిస్తారు.

బోథ్‌ నుంచే 50వేల జనం
ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం బోథ్‌ పరిధిలోని నేరడిగొండలో నిర్వహించనున్న ఈ సభకు స్థానికంగా ఉన్న తొమ్మిది మండలాల నుంచే కనీసం 50వేల మందిని సమీకరించాలని నేతలు నిర్ణయించారు. నేరడిగొండ, బోథ్, గుడిహత్నూరు, తలమడుగు, బజార్‌హత్నూరు, భీంపూర్, తాంసి, సిరికొడ, తలమడుగు, ఇచ్చోడలలో ఒక్కో మండలం నుంచి 10వేలకు తగ్గకుండా జన సమీకరణ చేయాలని భావిస్తున్నారు.

ఏ గ్రేడ్‌ కింద ఐదు సెగ్మెంట్లు
ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల పరిధిలోని ఐదు నియోజకవర్గాలను ఏ–గ్రేడ్‌ గా నిర్ణయించారు. జన సమీకరణలో ఈ ఐదు సెగ్మెంట్లదే కీలక పాత్ర. లక్షన్నర జనాన్ని ఈ నియోజకవర్గాల నుంచి తీసుకురావాలని యోచిస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలోని ఐదు సెగ్మెంట్లలో ఒక్కో చోట నుంచి 10వేలకు తక్కువ కాకుండా జనాలను సమీకరిస్తారు. సభకు జనాన్ని తరలించేందుకు వాహనాలకు సంబంధించి కూడా నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు,  సమన్వయకర్తతో సమన్వయం చేసుకొని సభకు వచ్చే వారికి అవసరమైన ఏర్పాట్లు చేసేలా ప్రణాళిక రూపొందించారు.

పొన్నం ప్రభాకర్‌  ప్రత్యక్ష పర్యవేక్షణ
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ నేరడిగొండ సభకు సంబంధించి ప్రత్యక్ష పర్యవేక్షణ జరుపనున్నట్లు సమాచారం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పొన్నం డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. సోమవారం ఆయన నేరడిగొండకు వచ్చి నాయకులతో సమావేశమై సభా ఏర్పాట్లు పర్యవేక్షించున్నారు. వాహనాలకు సంబంధించి కూడా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, బోస్‌రాజు కూడా సభకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

మరిన్ని వార్తలు