నర్సాపూర్‌లో రాహుల్ పాదయాత్ర?

29 Apr, 2015 01:31 IST|Sakshi
నర్సాపూర్‌లో రాహుల్ పాదయాత్ర?

రైతులను పరామర్శించేందుకు రానున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు  
 మే రెండో వారంలో నిర్వహించే అవకాశం
 
 సాక్షి, హైదరాబాద్: రైతులను పరామర్శించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నట్లు టీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో పాదయాత్ర చేస్తారని.. అయితే ఇంకా కచ్చితమైన షెడ్యుల్ రాలేదని పేర్కొన్నాయి. ఈ మేరకు పార్టీ అధినాయకత్వం నుంచి టీపీసీసీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి దీనికి సంబంధించి మంగళవారం మెదక్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లా నేతలతో చర్చించారు కూడా. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. రైతుల ఆత్మహత్యలు, వడగళ్లతో ఎక్కువ నష్టం జరిగిన ప్రాంతాల్లో రాహుల్‌గాంధీ సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. మే రెండోవారంలో ఈ పర్యటన ఖరారైంది.
 
 
 తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. నిర్మల్ (ఆదిలాబాద్)లో ఎక్కువమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని టీపీసీసీ అధ్యయనంలో తేలింది. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, గజ్వేల్ ప్రాంతం రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానంలో ఉంది. దీంతోపాటు స్టేషన్ ఘన్‌పూర్, మహబూబాబాద్ (వరంగల్), పరిగి (రంగారెడ్డి)ల్లోనూ పర్యటన చేపడితే ఎలా ఉంటుందనే అంశంపైనా చర్చించారు. అయితే ఇందిరాగాంధీ హయాం నుంచి మెదక్ జిల్లాకు, ఆ కుటుంబానికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆ జిల్లాలోనే రాహుల్ పాదయాత్ర ఏర్పాటుచేయాలని టీపీసీసీ నేతలు భావిస్తున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ బుధవారం రాత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా రాహుల్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై పార్టీ ముఖ్యులతో సమావేశమవుతారు. ఆలోపు రాహుల్ పర్యటన వివరాలు ఖరారయ్యే అవకాశాలున్నాయి. కాగా.. ఈ నెల 30లోగా పార్టీ సభ్యత్వ వివరాలను సీడీలతో సహా అందించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతలకు సూచిం చారు. మంగళవారం మెదక్, వరంగల్ జిల్లాల నేతలతో గాంధీభవన్‌లో ఆయన సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సభ్యత్వమే కీలకమని, పార్టీ నేతలంతా దీనిపై సీరియస్‌గా దృష్టిని సారించాలని కోరారు.

మరిన్ని వార్తలు