ప్రైవేట్‌ రైళ్లకు రైల్వేబోర్డు పచ్చజెండా

10 Jul, 2020 04:09 IST|Sakshi

ప్రైవేటు రైళ్లకు పచ్చజెండా.. సికింద్రాబాద్‌ క్లస్టర్‌లో పది రూట్ల ఎంపిక

ఆరు నెలల్లో ఫైనాన్షియల్‌ బిడ్లు.. ఎయిర్‌లైన్స్‌ తరహాలో రైళ్ల నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేట్‌ రైళ్లకు రైల్వేబోర్డు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం పలు మార్గాల్లో ఐఆర్‌సీటీసీ నడుపుతున్న తేజాస్‌ రైళ్ల తరహాలోనే ప్రైవేట్‌ సంస్థలకు చెందిన రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ప్రయాణికులకు మరింత వేగవంతమైన, పారదర్శక రైల్వే సదుపాయాన్ని అందజేసేందుకే ప్రైవేట్‌ రైళ్లకు అనుమతినిస్తున్నట్లు రైల్వే బోర్డు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 12 క్లస్టర్లను ఏర్పాటుచేసి, 109 మార్గాలను ఖరారు చేశారు. అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్‌ క్లస్టర్‌లో 10 మార్గాల్లో ప్రైవేటు రైళ్లు పరుగులు తీయనున్నాయి.

వీటిలో ముంబై– ఔరంగాబాద్, విశాఖ–విజయవాడ రైళ్లు మినహా మిగతావి సికింద్రాబాద్‌ కేంద్రంగానే రాకపోకలు సాగించనున్నాయి. త్వరలో సాంకేతిక టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి, వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక టెండర్లను కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు బడా ప్రైవేట్‌ వ్యాపార సంస్థలు, కన్సార్షియంల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే మూడేళ్లలో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కుతాయని అంచనా.

డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యోగులు
ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ విమానాలు నడిపే ప్రైవేట్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థల తరహాలోనే ఈ ప్రైవేట్‌ రైళ్లూ నడవనున్నాయి. ఈ సంస్థలు  అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన ప్రయాణ సదుపాయాలను అందజేస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. కచ్చితమైన సమయపాలన పాటిస్తారు. ప్రస్తుతం రైళ్లలో ఐఆర్‌సీటీసీ కేటరింగ్‌ నిర్వహిస్తుండగా, ప్రైవేట్‌ రైళ్లలో ఆ సంస్థలే ఈ సదుపాయాన్ని కల్పిస్తా యి.

ముంబై–లఖ్నవూ మధ్య నడు స్తున్న తేజా స్‌ ట్రైన్‌ తరహాలోనే ఈ ప్రైవేట్‌ రైళ్లు ఉంటాయి. ఈ రైళ్లలో డ్రైవర్, గార్డు మాత్రమే రైల్వే ఉద్యో గులై ఉంటారు. మిగతా సిబ్బంది మొత్తం ప్రైవే ట్‌ సంస్థలకు చెందిన వాళ్లే ఉంటారు. రైళ్ల రాక పోకలు, సిగ్నలింగ్‌ మాత్రం రైల్వేశాఖే పర్య వేక్షి స్తుంది. రైల్వే పట్టాలపై తమ రైళ్లను నడుపు కొన్నందుకు ప్రైవేట్‌ సంస్థలు నిర్ధారిత మొత్తా న్ని రైల్వేలకు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రైవేట్‌ సంస్థలతో ఏర్పాటు చేసుకొనే ఒప్పం దంలో భాగంగా ఆయా సంస్థలకు చెందిన రైళ్ల నిర్వహణకు 35 ఏళ్ల అనుమతులు లభిస్తాయి.

రైల్వేల నిర్వీర్యానికే..
ప్రైవేట్‌ రైళ్లకు అనుమతినివ్వడాన్ని కార్మిక సంఘాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడతారని, భవిష్యత్తులో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవని దక్షిణమధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి శంకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న రైల్వేలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెడుతుందన్నారు. ప్రయాణికులకు ప్రస్తుతం అతి తక్కువ చార్జీల్లో రైల్వే ప్రయాణం లభిస్తుండగా, ప్రైవేట్‌ రైళ్ల వల్ల చార్జీలు భారీగా పెరుగుతాయని చెప్పారు. 

సికింద్రాబాద్‌ క్లస్టర్‌లో నడవనున్న ప్రైవేటు రైళ్లివే..
సికింద్రాబాద్‌ – శ్రీకాకుళం
సికింద్రాబాద్‌ – గుంటూరు
సికింద్రాబాద్‌ – తిరుపతి
సికింద్రాబాద్‌ – ముంబై
సికింద్రాబాద్‌ – హౌరా
సికింద్రాబాద్‌– తిరుపతి – వారణాసి
విశాఖ – బెంగళూరు
తిరుపతి – సికింద్రాబాద్‌
ముంబై – ఔరంగాబాద్‌
విశాఖ – విజయవాడ

మరిన్ని వార్తలు