తెలంగాణ ఆశలు ఆవిరి

27 Feb, 2015 02:18 IST|Sakshi

- కనికరించని రైల్వే మంత్రి
- ప్రాజెక్టులకు బడ్జెట్‌లో దక్కని ప్రాధాన్యం
- పాత వాటికీ కంటితుడుపు కేటాయింపులు
- కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు
- మనోహరాబాద్-కొత్తపల్లి లైనుకూ అరకొర నిధులు
- సీఎం విన్నపాలూ బుట్టదాఖలు

 
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోదీ సంస్కరణల హోరులో తెలంగాణ రైల్వే ఆశలు కొట్టుకుపోయాయి. కొత్త రైళ్ల ఊసేలేని బడ్జెట్‌తో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఏ దశలోనూ తెలంగాణపై జాలి చూపలేదు. కనీసం దశాబ్దాలుగా పెండింగులో ఉన్న పాత ప్రాజెక్టులకైనా నిధులు విదిల్చలేదు. చివరికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పదేపదే విజ్ఞప్తి చేసి, స్వయంగా అందించిన విన్నపాలను కూడా నిర్దయగా బుట్టదాఖలు చేశారు. వెరసి మోదీ పాలనలోనూ తెలంగాణ రైల్వే తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. 25 ఏళ్ల క్రితం మంజూరైన పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ లైన్ పూర్తి అయ్యేలా రూ. 141 కోట్లు కేటాయించడమొక్కటే రాష్ట్రానికి ఏకైక ఓదార్పు.
 
తీవ్ర రైల్ ట్రాఫిక్‌తో అల్లాడుతున్న విజయవాడ-కాజీపేట-బల్లార్షా మార్గంలో మూడో లైన్ నిర్మాణానికి రూ. 146 కోట్లు కేటాయించడం క ంటితుడుపుగా మిగిలింది. ఇవి మినహా తెలంగాణకు కేటాయించిన, ప్రకటించిన చెప్పుకోదగ్గ లైన్లు, ఇతర పనులేవీ లేవు. రాష్ట్ర విభజన సమయంలో గత యూపీఏ-2 ప్రభుత్వం ప్రతిపాదించిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా ఒట్టిదేనని తేలిపోయింది. దాని సాధ్యాసాధ్యాలపై అప్పట్లో శరవేగంగా ఏర్పాటైన కమిటీ కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని తేల్చి చెప్పింది. అయితే రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో దానిపై ఆశలు సన్నగిల్లలేదు. తాజా బడ్జెట్‌లో కనీసం రేఖామాత్రంగానైనా దాని ప్రస్తావన ఉంటుందని ప్రజలు ఆశించినా ఆ ఊసే లేదు.  
 
మనోహరాబాద్-కొత్తపల్లికి మళ్లీ నిరాశే
హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు నేరుగా రైల్వే మార్గంతో అనుసంధానించే మనోహరాబాద్-కొత్తపల్లి లైను విషయంలో తాజా బడ్జెట్‌లో కూడా అడుగు ముందుకు పడలేదు. సిద్దిపేట, గజ్వేల్ మీదుగా సాగే ఈ లైను కేసీఆర్ కలల ప్రాజెక్టు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండగా ఈ లైన్ సర్వే పనులు మంజూరు కాగా ఇప్పటికీ పురోగతి లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రంపై ఒత్తిడి తేవటంతో గత బడ్జెట్‌లో రూ. 10 కోట్లు కేటాయించారు. ఈసారి భారీగా నిధులివ్వాలని సీఎం స్వయం గా కోరినా కేవలం రూ. 20 కోట్లతో సరిపెట్టారు. ఇక హైదరాబాద్-మహబూబ్‌నగర్ మార్గంలో రెండో లైన్ నిర్మాణానికి రూ. 27.44 కోట్లను కేటాయించారు. రూ. 1200 కోట్లు అవసరమయ్యే 110 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకు ఇంత తక్కువ నిధులివ్వడం నిరాశపరిచింది.
 
లెవల్ క్రాసింగ్స్‌పై దృష్టి
గత సంవత్సరం మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూల్ బస్సును రైలు ఢీకొని 18 మంది చనిపోయిన దుర్ఘటన నేపథ్యంలో ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలకు రైల్వేమంత్రి ప్రాధాన్యతనిచ్చా రు. బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు 38 ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలను మంజూరు చేశారు. వీటిని నిర్మించేందుకు రూ. 1587 కోట్లు అవసరమని అంచనా వేశారు. తొలి విడతగా రూ. 101.67 కోట్లు కేటాయించారు. ఇందులో తెలంగాణకు 14 కేటాయించినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు పంపిన ప్రతిపాదనల్లో 15 ఆర్‌ఓబీ/ఆర్‌యూబీలను ప్రస్తావించగా 14 మంజూరు కావడం విశేషం. రైలు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న మార్గాల్లో వీటిని నిర్మిస్తారు.
 

మరిన్ని వార్తలు