మంత్రి కేటీఆర్‌కు కోర్టులో ఊరట

30 Aug, 2017 13:09 IST|Sakshi
మంత్రి కేటీఆర్‌కు కోర్టులో ఊరట

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రులకు రైల్వే కోర్టులో ఉపశమనం లభించింది. 2011లో ప్రత్యే తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్‌ రోకో నిర్వహించి, రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారనే ఆరోపణలతో కేసు విచారణను ఎదుర్కొంటున్నారు.  దీనిపై గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్‌ రైల్వేకోర్టులో జరుగుతున్న విచారణకు మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, పద్మారావు సికింద్రాబాద్ రైల్వే కోర్టులో తరచూ హాజరవుతున్నారు.

బుధవారం మంత్రులు తుది విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే దీనిపై పలుసార్లు విచారించిన రైల్వేకోర్టు, కేసులో సరైన ఆధారాలు లేనందున కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. మంత్రులు నాయిని, కేటీఆర్, పద్మారావు సహా 14 మందిపై ఉన్న కేసులను కోర్టు కొట్టివేసింది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో మౌలాలి జంక్షన్‌లో రైల్‌రోకో నిర్వహించిన సందర్భంగా కేసు నమోదైన విషయం తెలిసిందే.

దీనిపై మంత్రి కె తారకరామారావు ఆనందం  వ్యక్తం చేశారు. ఈరోజు ఇలా గడిచింది అనుకొనేలోపు ఇంకా ఆరు కేసలు పెండింగ్‌లో ఉన్నాయంటూ లాయర్‌ గుర్తుచేశారని సోషల్‌ మీడియా ట్విట్టర్‌లో తెలిపారు.

 

మరిన్ని వార్తలు