‘క్రాసింగ్‌’ దాటని ప్రాజెక్టులు

26 Feb, 2018 03:13 IST|Sakshi

     సాగు నీటి ప్రాజెక్టులకు అడ్డొస్తున్న రైల్వే క్రాసింగ్‌ పనులు  

     32 ప్రాంతాల్లో సమస్య.. 4.74 లక్షల ఎకరాలపై ప్రభావం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు రైల్వే క్రాసింగ్‌లో చిక్కుకుంటున్నాయి. ప్రాజెక్టుల పరిధిలోని కాల్వల నిర్మాణాలు రైల్వే లైన్లు దాటలేక చతికిలబడుతున్నాయి. తొమ్మిది ప్రాజెక్టుల పరిధిలో 32 రైల్వే క్రాసింగ్‌లు ప్రాజెక్టుల పనులకు అడ్డుగా నిలుస్తుండటంతో 4.74 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రభావితమవుతోంది. ఈ విషయమై రైల్వేతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. నిజానికి 11 సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో 60 చోట్ల రైల్వేకు సంబంధించిన అడ్డంకులున్నాయి.

ఇందులో ఇప్పటికే 26 క్రాసింగ్‌ల పనులు పూర్తయ్యాయి. మరో 32 చోట్ల పూర్తయితే గానీ కాల్వల తవ్వకం, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టడం కుదరదు. ఇందులో నెట్టెంపాడు పరిధిలో 5, దేవాదులలో 6, ఎల్లంపల్లిలో 3, కాళేశ్వరంలో 3, ఉదయసముద్రం, వరద కాల్వ పరిధిలో రెండేసి చొప్పున క్రాసింగ్‌ సమస్యలున్నాయి. పెనుగంగ, కొమురం భీం పరిధిలోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయి. క్రాసింగ్‌లకు సంబంధించి నిధులను నీటి పారుదల శాఖ రైల్వేకు డిపాజిట్‌ చేస్తున్నా పనుల్లో వేగం మాత్రం కానరావడంలేదు.  

పనులు పట్టాలెక్కుతాయా..? 
రైల్వే క్రాసింగ్‌ల వల్ల ప్రభావితమవుతున్న 4,74,851 ఎకరాల ఆయకట్టులో 3,38,507 ఎకరాలకు ఈ ఏడాది చివరికి నీళ్లివ్వాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు నెట్టెంపాడు, దేవాదుల, కొమురం భీం, ఉదయసముద్రం, ఎల్లంపల్లి పరిధిలో 18 చోట్ల రైల్వే క్రాసింగ్‌ల పనులు పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌తో మంత్రి హరీశ్‌రావు ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. క్రాసింగ్‌ ఇబ్బందులపై వివరణ ఇచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్‌ మొదలయ్యే నాటికి 12 క్రాసింగ్‌ పనులు పూర్తి చేసి 90,709 ఎకరాలకు.. రబీ నాటికి మరో 2,47,798 ఎకరాలకు నీరిచ్చేలా పనులు పూర్తి చేయాలని కోరారు. మరో 14 క్రాసింగ్‌లను పూర్తి చేస్తే 1,36,344 ఎకరాలకు నీరందు తుందని చెప్పారు. దీనిపై రైల్వే జీఎం సానుకూలత వ్యక్తం చేసినా పనులు పట్టాలెక్కుతాయా? ఆయకట్టుకు నీరందుతుందా? వేచి చూడాలి.

మరిన్ని వార్తలు