రైల్వే బీమా వసూల్‌! 

25 Sep, 2018 01:21 IST|Sakshi

ఈ–టికెట్‌పై రూపాయి చెల్లిస్తేనే ఇన్సూరెన్స్‌

9నెలల పాటు సాగిన ఉచిత బీమాకు మంగళం

ప్రైవేటు కంపెనీల లబ్ధి కోసమేనంటున్న ప్రయాణికులు

ప్రభుత్వ బీమా కంపెనీలను విస్మరించడంపై విమర్శలు

ఏడాదికి బీమా ద్వారా వసూలయ్యేది రూ.48 కోట్లు..

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే శాఖ ఖర్చులు తగ్గించుకుని సంస్థాగత బలోపేతానికి చర్యలు చేపట్టింది. భారంగా పరిణమించిన విషయాల నుంచి మెల్లిగా దూరం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రయాణికుల వద్ద నుంచి అదనపు వసూళ్లకు వెనకాడటం లేదు. ఇందులో భాగం గా 2016లో ‘ఫ్లెక్సీ ఫెయిర్‌ సిస్టం’ను ప్రవేశపెట్టింది. దీనివల్ల ప్రయాణికులకు పెద్దగా లాభం లేకపోయినా.. రైల్వేకు మాత్రం బాగానే ఆదాయం సమకూరుతోంది. తాజాగా ఈ–టికెట్‌ తీసుకునే ప్రయాణికులకు బీమాను ఆప్షన్‌ గా మార్చింది. అంటే.. ఇకపై ఆన్‌లైన్‌లో ఐఆర్‌ సీటీసీ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికులకు బీమా కావాలా? వద్దా అనేది వారి ఇష్టానికే వదిలేసింది. అంటే.. టికెట్‌ కోసం వివరాలు సమర్పించే సమయంలో ఇన్సూరెన్స్‌ కూడా ఒక ఆప్షన్‌గా ఇస్తుంది. కావాల్సిన వారికి రూ.1 అదనంగా వసూలు చేస్తారు. (వాస్తవానికి ఇది 92 పైసలుగా ఉంది. పన్నులన్నీ కలుపుకొని రూ.1గా నిర్ణయించారు) 

ఏంటి లాభం? 
వాస్తవానికి ఆన్‌లైన్‌ విధానంలో టికెట్‌ బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు 2017 డిసెంబర్‌ నుంచి ప్రయాణికులకు ఉచిత బీమా రైల్వేశాఖ అమలు చేస్తోంది. ఈ విధానం ఈ నెల 2 వరకు కొనసాగింది. దాదాపు 9 నెలల పాటు ప్రయాణికులకు ఉచిత బీమా సదుపాయం కల్పించింది. ఇటీవల ఈ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానాన్ని తెచ్చింది. స్లీపర్, ఏసీ, చెయిర్‌ కార్‌ సీట్ల కోసం టికెట్లు బుక్‌ చేసే ప్రయాణికులు బీమా కావాలా వద్దా? అన్నది ఇకపై వారిష్టమన్న మాట. ఇందుకోసం ఐసీఐసీఐ, సుందరం, శ్రీరామ్‌ ఫైనాన్స్‌లాంటి సంస్థలతో రైల్వే శాఖ ఒప్పందం చేసుకుంది. బీమా తీసుకున్న ప్రయాణికులు ప్రమాదవశాత్తూ చనిపోతే.. రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తారు. శాశ్వతంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల వరకు పరిహారం లభిస్తుంది. 

ప్రైవేటు కంపెనీల లబ్ధికే..ప్రయాణికులు 
ఈ–టికెట్‌పై బీమాను ఆప్షన్‌గా చేయడంపై ప్రయాణికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రయాణికుడి సంక్షేమాన్ని ప్రభుత్వం ప్రైవేటు బీమా సంస్థలకు అప్పగించడం సరికాదని అభిప్రాయపడుతున్నా రు. అదనంగా బీమా వసూలు చేయడమేంటని ప్ర శ్నిస్తున్నారు. ప్రభుత్వ కంపెనీలకు కాకుండా ప్రైవే టు కంపెనీలకు ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు.

బీమా అందరికీ ఉంటుంది రైల్వే అధికారులు
బీమా విషయంలో సాధారణ టికెట్‌ ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రయాణికులకు ఏదైనా జరిగితే వారికి నష్ట పరిహారం రైల్వే శాఖ చెల్లిస్తుందని చెబుతున్నారు. ఈ–టికెట్‌/ఐఆర్‌సీటీసీ ద్వారా బుక్‌ చేసుకునే వారికి ఈ బీమా అదనం అని వెల్లడిస్తున్నారు.

ఐఆర్‌సీటీసీలో నమోదు చేసుకున్న వారి సంఖ్య 3,00,00,000
రోజుకు జరిగే బుకింగ్‌లు 5,00,000 నుంచి 13,00,000
నెలకు వసూలయ్యే బీమా రూ. 1.5కోట్ల నుంచి రూ. 3.9 కోట్లు
ఏడాదికి వసూలయ్యే బీమా రూ. 18కోట్ల నుంచి రూ. 48 కోట్లు

మరిన్ని వార్తలు