సికింద్రాబాద్‌ నం–1

10 Nov, 2017 02:41 IST|Sakshi

ప్రయాణికుల సదుపాయాల్లో దేశంలోనే రోల్‌మోడల్‌

600 స్టేషన్‌లను పరిశీలించగా సికింద్రాబాద్‌ అగ్రగామిగా ఉంది

కేంద్ర రైల్వే ప్రయాణికుల సదుపాయాల కమిటీ కితాబు

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ మరో ఘనతను సొంతం చేసుకుంది. ప్రయాణికుల సదుపాయాల కల్పనలో దేశంలోనే ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ మేరకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన కేంద్ర రైల్వే ప్రయాణికుల సదుపాయాల కమిటీ కితాబు నిచ్చింది. తాము ఇప్పటివరకు పరిశీలించిన 600 రైల్వేస్టేషన్‌లలో సికింద్రాబాద్‌ చాలా బాగుందని, విమానాశ్రయం తరహాలో సదుపాయాలు ఏర్పాటు చేశారని కమిటీ ప్రతినిధులు ప్రశంసించారు.

దేశవ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు అందజేసే సదుపాయాలపై విస్తృతస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్న ఈ కమిటీ.. గురువారం నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లతో పాటు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను సందర్శించింది. మంచినీటి సదుపాయం, విశ్రాంతి గదులు, ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు, కేటరింగ్‌ వంటి అన్ని అంశాలపైనా దృష్టి సారించారు. రైళ్ల నిర్వహణలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం వారు పరిశీలించారు. రైల్వే రక్షక దళం సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

సదుపాయాల కమిటీ ఏర్పాటు తీరిది..
దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఎలాంటి సదుపాయాలు అమలవుతున్నాయి. ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏ స్టేషన్‌లో ఏవిధమైన ప్రత్యేతలు, లేదా లోపాలు ఉన్నాయి. ప్రతికూల అంశాలను ఎలా అధిగమించాలి అనే అంశాలతో పాటు రైల్వేసేవల పట్ల ప్రయాణికులు ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారనే విషయాలను తెలుసుకొనేందుకు రైల్వేబోర్డు పార్లమెంట్‌ సభ్యులు హెచ్‌.రాజా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఇతరులు ఈ కమిటీలో ప్రతినిధులుగా ఉన్నారు. లోధారామ్‌ నరాంగి, ఎంపీ ఎల్‌పీ జైస్వాల్, మనీషా ఛటర్జీ, రాంధీమ్‌ సింగ్, రాజవర్ధన్‌రెడ్డి, ప్రభునాథ్‌ చౌహాన్‌ తదితరులు కమిటీలో ఉన్నారు. రెండేళ్ల పాటు ఇది విధులు నిర్వహిస్తుంది. మొత్తం 17 మంది సభ్యులున్న ఈ కమిటీలో ఆరుగురు సభ్యుల బృందం నగరంలోని రైల్వేస్టేషన్‌లను సందర్శించింది.


సికింద్రాబాద్‌ ద బెస్ట్‌...
ఒక ప్లాట్‌ఫామ్‌ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు అందుబాటు లోకి వచ్చిన లిఫ్టులు, ఎస్కలేటర్లు, అన్ని ప్లాట్‌ఫామ్‌లపైన ఏర్పాటు చేసిన సీసీటీవీలు, ఒకటో నంబర్, పదో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న అన్ని సదుపా యాలతో కూడిన విశ్రాంతి గదులు, డార్మెటరీ, వాటర్‌ వెండింగ్‌ యంత్రాలు, కేటరింగ్‌ సదుపాయం వంటి వాటిని కమిటీ పరిగణనలోకి తీసుకుంది. ఈ సందర్భంగా జైస్వాల్‌ మాట్లాడుతూ, తాము  పరిశీలించిన 600 రైల్వేస్టేషన్‌లలో సికింద్రాబాద్‌ ద బెస్ట్‌గా ఉందన్నారు.

మరిన్ని వార్తలు