పట్టాలు.. కటకటాలు!

4 Apr, 2018 02:26 IST|Sakshi

పట్టాలపై సెల్ఫీ దిగితే జైలే

చట్టాలకు పదును పెడుతున్న రైల్వే పోలీసులు  

సాక్షి, హైదరాబాద్‌: రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ తీసుకోవాలనుకుంటున్నారా.. పరుగులు పెట్టే ట్రైన్‌ పక్కన నిలబడి సెల్ఫీ తీసుకోవడం క్రేజీగా భావిస్తున్నారా.. అయితే జైలు శిక్షకూ సిద్ధంగా ఉండాల్సిందే. రైళ్లు, రైల్వే స్టేషన్లు, బోగీలపై నించొని సెల్ఫీలు తీసుకొనే సెల్ఫీరాయుళ్లను కట్టడి చేసేందుకు రైల్వే పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. రైల్వే చట్టాలకు పదును పెడుతున్నారు. అక్రమంగా పట్టాలు దాటే వారిని, సెల్ఫీలు దిగేవారిని నియంత్రించేందుకు జైలు శిక్ష విధించేలా కేసులు నమోదు చేయడమే సరైన చర్యగా భావిస్తున్నట్లు రైల్వే పోలీస్‌ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. 

పటిష్టంగా చట్టాల అమలు... 
ఇటీవల నగరంలోని భరత్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద దూసుకొస్తున్న ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ పక్కన నించొని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన శివ అనే యువకుడి ఉదంతం సోషల్‌ మీడియాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సదరు నిందితుడికి కేవలం రూ.500 జరిమానా విధించి వదిలేశారు. అయితే రైల్వే చట్టం 147 ప్రకారం రూ.500 నుంచి రూ.1,000 వరకు జరిమానా విధించడంతో పాటు 6 నెలల జైలూ విధించే అవకాశం ఉన్నా చాలా వరకు జరిమానాలకే పరిమితమవుతున్నారు. ఇక నుంచి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు రైల్వే పోలీస్‌ డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.  

ప్రమాదాల నివారణకు చర్యలు 
రైల్వే ట్రాక్‌లపై ఏటా వందలాది ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆత్మహత్యలు చేసుకునేవారు కొందరైతే ఇలా సెల్ఫీల కోసం, పట్టాలు దాటేందుకు ట్రాక్‌పైకి వచ్చి రైళ్లు ఢీకొని మృత్యువాత పడుతున్నవారు మరికొందరు. ప్రమాద మృతులకు దక్షిణమధ్య రైల్వే రూ.8 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తోంది. ఏటా సుమారు రూ.25 కోట్ల వరకు పరిహారం రూపంలో వెచ్చిస్తున్నట్లు అంచనా. మృత్యువాత పడిన తరువాత బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వడం కంటే అసలు ప్రమాదాలే జరగకుండా చర్యలు తీసుకోవడం మంచిదని రైల్వే పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు