తెర మరుగేనా!

24 Oct, 2018 01:45 IST|Sakshi

    సెకండ్‌ ఏసీ బోగీల్లో తెరల తొలగింపు ఆలోచనలో రైల్వే శాఖ! 

    తెరల స్థానంలో బ్లైండర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు

సాక్షి, హైదరాబాద్‌: రైళ్లల్లో దూరప్రాంతం ప్రయాణికుల ఏకాంతానికి భంగం కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో సెకండ్‌ క్లాస్‌ ఏసీ బోగీల్లో ఏర్పాటు చేసిన తెరలను తొలగించేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ తెరల స్థానంలో బ్లైండర్లను తీసుకొచ్చేలా రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రైళ్లలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఈ తెరల వల్ల మంటలు మరింత వేగంగా వ్యాపించడానికి కారణమవుతాయని అధికారులు 2009లో నివేదిక ఇచ్చారు. దీంతో ఇదివరకు జరిగిన అగ్ని ప్రమాదాల దృష్ట్యా ఫస్ట్, థర్డ్‌ ఏసీ బోగీల్లోని తెరలను మాత్రమే రైల్వే శాఖ తొలగించింది. అయితే నిప్పు త్వరగా అంటుకోని విధంగా రూపొందించిన తెరలను సెకండ్‌ క్లాస్‌ ఏసీ బోగీల్లో మాత్రమే ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాటిని కూడా తొలగించేందుకు రైల్వే శాఖ ప్రయత్నం చేస్తోంది.  

ప్రయాణికుల చేష్టల వల్లే..! 
తెరల స్థానంలో బ్లైండర్లు తీసుకురావడానికి ప్రధాన కారణం ప్రయాణికులేనని రైల్వే శాఖ చెబుతోంది. ఇందులో ప్రయాణించే చాలామంది ప్రయాణికులు ఈ తెరలను తమ చేష్టలతో పాడుచేస్తున్నారు. భోజనం చేశాక, ఈ తెరలతోనే చేతులు, మూతులు తుడుచుకోవడం, కొందరు బూట్లను, పాదరక్షలను తుడవటం వంటి వ్యక్తిగత అవసరాలకు వాడుకుని వాటిని మురికి చేస్తున్నారు. దీంతో అవి దుర్వాసన రావడం, మురికిగా తయారవడంతో రైల్వే శాఖ వీటిని తొలగించేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. తెరల స్థానంలో బ్లైండర్లు ఏర్పాటుతో ప్రయాణికులు అపరిశుభ్ర చేష్టలకు అడ్డుకట్ట వేసినట్లు ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది.  

దక్షిణ మధ్య రైల్వేలో ఇలా..: దక్షిణ మధ్య రైల్వేలో ప్రతిరోజూ దాదాపు 110 రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలకు బయల్దేరుతాయి. ఇందులో ప్రయాణించే వారి సంఖ్య 12,000లకు పైగానే ఉంటోంది. ఒకవేళ ఇదే నిర్ణయం దక్షిణ మధ్య రైల్వేలోనూ అమలు చేయాల్సి వస్తే.. ఈ అన్ని రైళ్లలోనూ తెరలస్థానంలో బ్లైండర్లు బిగించాల్సి వస్తుంది. బ్లైండర్ల ఏర్పాటుతో ప్రయాణికుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు