తెలంగాణ: రాగల మూడు రోజులు వర్ష సూచన

2 May, 2020 14:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలంగాణలో రాగల మూడురోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ శనివారం తెలిపింది. ఈ రోజు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు అక్కడక్కడా గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
(చదవండి: వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం)

‘దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది మరింత బలపడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటలలో అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి క్రమంగా మే 6 వరకు ఉత్తర వాయువ్య దిశగా  ప్రయాణించే అవకాశం ఉంది. ఈశాన్య మరఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఇంటీరియర్  కర్ణాటక మీదుగా 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది’అని వాతావరణ శాఖ డైరెక్టర్‌ పేర్కొన్నారు.
(చదవండి: ప్రమాద ఘంటికలు)

మరిన్ని వార్తలు