హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం

31 May, 2020 13:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలుచోట్ల వాతావరణం చల్లబడి.. ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడుతోంది. ఎల్‌బీ నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హయత్‌నగర్‌, మలక్‌పేట్‌, సంతోష్‌నగర్‌, అబిడ్స్‌, కోఠి, బంజారాహిల్స్‌, ఉప్పల్‌, ఘట్కేసర్‌, మోహిదీపట్నం, జీడిమెట్ల, మాదాపూర్‌, పంజాగుట్టలలో వర్షం కురుస్తోంది. కాగా, గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరయిన జనాలు.. వర్షం పలకింపుతో వేసవితాపం నుంచి కాస్త ఉపశమనం పొందారు. హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో.. జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

మరోవైపు రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపు లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవ కాశం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్‌ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీంతో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. 

తగ్గిన ఉష్ణోగ్రతలు... 
రాష్ట్రంపై భానుడి ప్రతాపం కాస్త తగ్గింది. ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్, హన్మకొండ, రామగుండంలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

>
మరిన్ని వార్తలు