మురుగు ముప్పు

3 Jun, 2019 10:57 IST|Sakshi

ప్రారంభం కానున్న వర్షాకాలం డ్రైనేజీ పైప్‌లైన్ల ప్రక్షాళన మరిచిన బల్దియా  

2,258 ముంపు ప్రాంతాల గుర్తింపు పరిష్కారం మాత్రం శూన్యం  

సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం త్వరలో ప్రారంభం కానుంది. గ్రేటర్‌ పరిధిలో సుమారు 6వేల కిలోమీటర్లకు పైగా ఉన్న మురుగునీటి పైపులైన్లు, మరో 1,500 కి.మీ మార్గంలోని నాలాలను బల్దియా సమూలంగా ప్రక్షాళన చేయకపోవడంతో ముంపు ముప్పు పొంచి ఉంది. మూడు సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసినా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీలు మునిగిపోతుండడం ప్రతిఏటా పరిపాటిగా మారింది. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ నాలాలు ఉగ్రరూపం దాల్చడం, వరద, మురుగునీరు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులను ముంచెత్తడం తెలిసిందే. ప్రధానంగా మహానగరంలో సుమారు 120 బస్తీలతో పాటు తరచూ మురుగు సమస్యలు తలెత్తే 2,258 ప్రాంతాలకు సంబంధించి జలమండలి ప్రత్యేక మ్యాపులు సిద్ధం చేసింది. కానీ ఈ ప్రాంతాల్లో ప్రక్షాళన చర్యలు చేపట్టే విషయంలో బల్దియా, జలమండలి విభాగాలు విఫలమయ్యాయి. దీంతో ఈ సీజన్‌లోనూ ముంపు ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. 

సమస్యల వర్గీకరణ..   
గ్రేటర్‌లో ముంపు సమస్యలను నివారించేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి ప్రాంతాలను నాలుగు విభాగాలుగా విభజించింది. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో పూడికతీత, ఇతర ప్రక్షాళన పనులతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఆయా విభాగాలు విఫలమయ్యాయి.  
ఎ కేటగిరీ: మురుగు ఉప్పొంగడానికి ఆస్కారమున్నవి. వీటిని మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాలతో తరచూ శుభ్రం చేయడం. సిల్ట్‌ తొలగించి మురుగు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చేయడం.  
బి కేటగిరీ: నిర్వహణ డివిజన్లకు నెలవారీగా విడుదల చేసే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ నిధులతో ఈ సమస్యలను పరిష్కరించడం. మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, పునరుద్ధరణ, డీసిల్టింగ్‌ తదితర పనుల నిర్వహణ.  
సి కేటగిరీ: తరచూ మురుగు ఉప్పొంగే ప్రాంతాల్లో తక్షణ పరిష్కారానికి స్వల్ప దూరానికి పురాతన పైపులైన్ల మార్పు లాంటి పనులను వాటర్‌ బోర్డు సొంత నిధులతో చేపట్టడం.   
డి కేటగిరీ: భారీ మురుగునీటి పైపులైన్ల మార్పునకు సంబంధించినవి ఈ విభాగం కిందకు వస్తాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించడం. సర్కారు విడుదల చేసే నిధులతో భారీ పైపులైన్లు ఏర్పాటు చేయడం. 

మరిన్ని వార్తలు