రాష్ట్రంలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

3 Jun, 2019 07:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తర కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతా ల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. గల్ఫ్‌ ఆఫ్‌ మార్ట్‌ బాన్‌ నుంచి దక్షిణ కోమోరిన్, మాల్దీవుల ప్రాంతం వరకు ఏర్పడిన షియర్‌ జోన్‌ కూడా బలహీనమైంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో సోమవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారి రాజా రావు తెలిపారు. గత 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 5 సెం.మీ, కామారెడ్డి జిల్లా దోమకొండలో సెంటీమీటర్‌ చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో 45 డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, నల్లగొండల్లో 44 డిగ్రీల చొప్పున, భద్రాచలం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రామగుండంల్లో 43 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. మెదక్‌లో మాత్రం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

హైదరాబాద్‌లో ఎండ, వాన..
హైదరాబాద్‌లో ఆదివారం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఓ వైపు మబ్బులు పట్టి, అక్కడక్కడా చిరుజల్లులు కురిసినా, మరోవైపు ఎండ దంచే సింది. ఆదివారం నగరంలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 4 డిగ్రీలు అధికం కావటం విశేషం.

మరిన్ని వార్తలు