మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు

16 Jun, 2020 17:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాగల మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు, తూర్పు ఉత్తరప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. తూర్పు విదర్భ, దాని పరిసర ప్రాంతాలలో 5.8 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది.

(భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్)

దీంతో ఉత్తర బంగాళఖాతంలో జూన్‌ 19వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావారణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా తెలంగాణలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మంగళవారం నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్‌, కొమరం భీమ్‌, నిర్మల్‌, మంచిర్యాల జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. 

మరిన్ని వార్తలు