సీజన్‌ చేంజ్‌!

1 Jun, 2020 08:32 IST|Sakshi

రానున్న రోజుల్లో పొంచి ఉన్న వ్యాధుల ముప్పు

ఒకవైపు డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ.. మరోవైపు కరోనా

వైద్యులకు తలనొప్పిగా మారనున్న జ్వరాల గుర్తింపు ప్రక్రియ

కోవిడ్‌ కేసులతో గాంధీ ఐసోలేషన్‌ వార్డులు కిటకిట

పాజిటివ్‌ ఉన్నా.. లక్షణాలు లేకపోతే.. ఇక ఇంటికే

స్వీయ నియంత్రణే తారక మంత్రమంటున్న వైద్యారోగ్య శాఖ

సాక్షి, సిటీబ్యూరో: సీజన్‌ మారుతోంది. వ్యాధుల ముప్పు పెరగనుంది. ప్రస్తుతం కోవిడ్‌–19 బెంబేలెత్తిస్తుంటే..లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపునకు తోడు.. సీజన్‌లో వస్తున్న మార్పులతో  గ్రేటర్‌లో మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ జ్వరాలు విస్తరించనున్నాయి. వీటిని గుర్తించడం వైద్యారోగ్య శాఖకు పెద్ద సవాల్‌గా మారనుంది. ఒకవైపు కరోనా వైరస్‌.. మరోవైపు ఇతర విష జ్వరాలతో గ్రేటర్‌ ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి ప్రాణాలకు వాళ్లే భద్రత కల్పించుకోవాల్సిన   అవసరం ఉందని వైద్యారోగ్య నిపుణులు స్పష్టం చేస్తుండటమే ఇందుకు నిదర్శనం.

ఆంక్షల సడలింపు తర్వాతే..  
మార్చి 2న నగరంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మార్చి 22న జనతా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఆ తర్వాతి రోజునుంచి వరుస లాక్‌డౌన్‌లుకొనసాగుతూనే ఉన్నాయి. మార్చి 23 నుంచి ఏప్రిల్‌
7 వరకు తొలి విడత, ఆ తర్వాత 21 వరకు రెండో విడత, మే ఏడో తేదీ వరకు మూడో విడత, మే 28 వరకు నాలుగో విడత, ఆ తర్వాతఐదో విడత లాక్‌డౌన్‌ అమలైన విషయం తెలిసిందే. మార్చి రెండు నుంచి మార్చి 31 వరకు నగరంలో 64 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. ఏప్రిల్‌లో 537 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 15 మంది  మృత్యువాతపడ్డారు. మే 1 నుంచి 15 వరకు 363 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీర్ఘకాలిక లాక్‌డౌన్‌తో ఉపాధి అవకాశాలు దెబ్బతిని శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన ప్రభుత్వం మే 15 నుంచి పలు ఆంక్షలను సడలించిన విషయం తెలిసిందే. వైన్‌షాపులు, మార్కెట్లు, ఇతరషాపులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు సహా తెరుచు కోవడంతో ఆయా ప్రాంతాల్లో ఒక్కసారిగా జనం రద్దీ పెరిగింది. ఆంక్షల సడలింపును చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. వైరస్‌ పూర్తిగా తగ్గిపోవడం వల్లే ప్రభుత్వం ఆంక్షలు సడలించినట్లు భావించారు. మాస్కులు లేకుండా భౌతిక దూరం పాటించకుండా యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చారు. పుట్టిన రోజు, ఇతర వేడుకల పేరుతో అంతా ఒక్క చోట చేరి విందులు చేసుకుంటున్నారు. ఫలితంగా ఒకరి తర్వాత మరొకరు వైరస్‌ బారిన పడుతున్నారు. ఫలితంగా లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు తర్వాత కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యాయి. కేవలం 15 రోజుల్లోనే 569 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పాటు 49 మంది మృతి చెందడం గమనార్హం. 

రోగులతో కిటకిటలాడుతున్న గాంధీ..
తెలంగాణ వ్యాప్తంగా మే 30 వరకు 2,499 మంది కరోనా వైరస్‌ బారిన పడగా, వీరిలో 1,533 మంది గ్రేటర్‌ వాసులే. చికిత్సల తర్వాత 1,412 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి ఇళ్లకు  చేరుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 1010 మంది చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి గత వారం రోజుల నుంచి రోజుకు సగటున 150 మంది కొత్తగా వస్తున్నారు. ఐసీయూ సహా ఐసోలేషన్‌ వార్డులన్నీ దాదాపు నిండిపోయాయి. ఆస్పత్రిలో 1500 పడకల సామర్థ్యం ఉన్నప్పటికీ.. విధి నిర్వహణలో భాగంగా ఇక్కడి వైద్యులు గత మూడు నెలలుగా విరామం లేకుండా పని చేస్తున్నారు. చాలా కాలంగా కుటుంబ సభ్యులకు దూరంగా కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో వస్తున్న రోగులకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందించలేని దుస్థితి నెలకొంది. అంతేకాదు బాధితుల్లో 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కన్పించడం లేదు. కేవలం ఐదు శాతం మందికి మాత్రమే వెంటిలేటర్‌ సేవలు, 15 శాతం మందికి ఐసీయూ సేవలు అవసరం అవుతున్నాయి. పెద్దగా వైద్యసేవలు అవసరం లేకుండానే మిగిలిన వారు కోలుకుంటున్నారు. పాజిటివ్‌ నిర్ధారణయిన 50 ఏళ్లలోపు వారిని, ఏ ఇతర జబ్బులు లేని వారిని ఇకపై ఆస్పత్రిలో ఉంచడం కంటే.. స్థానిక వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉంచడమే ఉత్తమని వైద్యులు భావిస్తున్నారు. కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయి ఏ లక్షణాలు లేని సుమారు 350 మందిని త్వరలోనే డిశ్చార్జి చేసి, వైద్యులపై రోగుల భారం పడకుండా చూడాలని వైద్యారోగ్యశాఖ భావిస్తోంది.

మరిన్ని వార్తలు