వర్షాకాలం నాటికి కాళేశ్వరం నీళ్లు

26 Feb, 2019 04:38 IST|Sakshi

మండలిలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌

ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే వర్షాకాలంనాటికి కాళేశ్వరంప్రాజెక్టు ద్వారా పొలాలకు సాగునీరు అందిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో జరిగిన ద్రవ్య వినిమయ బిల్లు చర్చ సందర్భంగా ఈటల మాట్లాడారు. అంతకు ముందు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తూ పైవిధంగా స్పందిం చారు. రైతుల సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతీ పంటకు గిట్టుబాటు ధర అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో ఎర్రజొన్నలు, మొక్కజొన్నకు డిమాండ్‌ లేని సమయంలోనూ రైతులు నష్టపోకుండా అత్యధిక ధర కు ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు.వ్యవసాయానికి 24గంటల కరెంటు అందిస్తున్నామని, మోటారు కాలిపోయిందని ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.

కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రకుల పేదల రిజర్వేషన్ల బిల్లు పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. ఆడంబరాలకు పోయి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం అమాంతం పెంచేస్తోందని, చివరకు రెవెన్యూ లెక్కలు కుదరక తిరిగి తగ్గిస్తోందని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలు మహ్మద్‌ షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సాధ్యమైనంత మేర బడ్జెట్‌ పెట్టి పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని వారు కోరారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతోందని, సైబర్‌ నేరాలు కూడా విస్తరిస్తున్న సమయంలో మరిన్ని ఎక్కువ నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. బడ్జెట్‌ కేటాయింపులపై ఎమ్మెల్సీ మహ్మద్‌ జాఫ్రీ తదితరులు లేవనెత్తిన అంశాలపై మంత్రి ఈటల వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్‌ సభలో ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

భావోద్వేగానికి గురైన చైర్మన్‌ స్వామిగౌడ్‌
శాసనసభ చివరి రోజు సమావేశాల్లో చైర్మన్‌ స్వామిగౌడ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. వచ్చే నెలాఖరు లో తనతో పాటు పలువురు సభ్యుల పదవీ కాలం పూర్తికానుండటంతో ఆయన తన అనుభవాలను పం చుకున్నారు. పలు రంగాల్లో మేధావులతో జరిగిన అర్థవంతమైన చర్చలు తనకు సంతృప్తినిచ్చాయన్నా రు. రాజకీయాలకు అతీతంగా ప్రజాసమస్యలపై చర్చలు జరగాలని ఆయన ఆకాంక్షించారు. మండలి సభ్యుడిగా, చైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు స్వామిగౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సభ నిరవధిక వాయిదా పడింది.

ఏడు గంటలు... నాలుగు బిల్లులు...
ఈ నెల 22వ తేదీన మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శుక్ర, శని, సోమ మూడ్రోజుల పాటు సమావేశాలు జరగగా... ఏడు గంటల పాటు సభ కొనసాగింది. ఇందులో ఇరవై మంది సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడారు. నాలుగు బిల్లులు ఆమోదం పొందాయి.

మరిన్ని వార్తలు