పసుపు రైతులకు రైతుబంధు పథకం

4 Feb, 2018 01:51 IST|Sakshi
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మార్కెటింగ్‌ శాఖ కార్యక్రమాలు, సాగునీటి పథకాలపై సమీక్షిస్తున్న మంత్రి హరీశ్, ఎంపీ కవిత తదితరులు

మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్ణయం  

ఎంపీ కవితతో కలసి రైతు సమస్యలపై సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: పసుపు రైతులకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారు. శనివారం ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించి మార్కెటింగ్‌ శాఖ కార్యక్రమాలు, సాగునీటి పథకాలను మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవిత సమీక్షించారు. పసుపు ధర తగ్గినందున ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవాలని ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు, పసుపు రైతులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, రైతుబంధు పథకాన్ని పసుపు రైతులకు కూడా వర్తింపజేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. మార్కెట్‌ యార్డులతో పాటు వాటి వెలుపల ప్రైవేటు కోల్డ్‌స్టోరేజ్‌లలో పసుపు పంటను నిల్వ చేసుకున్న రైతులకు కూడా రైతుబంధు పథకం అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.

రైతుల తక్షణ అవసరాలకోసం రూ. 2 లక్షల రుణ సదు పాయం కల్పించాలన్నారు. దీనికి ఆరు నెలల దాకా రైతులు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరంలేదని తెలిపారు. గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత మార్కెట్లో అమ్ముకోవాలని పసుపు రైతులను హరీశ్‌రావు కోరారు. కాగా, పసుపు రైతుల సమస్యలను అధ్యయనం చేసేందుకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఆదివారం మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ నిజామాబాద్‌ వెళ్లనున్నారు.

ఎంపీ కవిత విజ్ఞప్తి మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో మామిడికాయల మార్కెట్‌ను అభివృద్ధి చేయాలని మంత్రి ఆదేశించారు. మామిడి కాయల దిగుబడి, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 9న మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, ఉద్యాన శాఖ, అపెడా అధికారులతో సమావేశం నిర్వహించాలని హరీశ్‌రావు, కవిత నిర్ణయించారు. కాగా ఈ నెల 19న బోధన్‌ నియోజకవర్గంలో హరీశ్‌రావు పర్యటించనున్నారు. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో సాగునీటి పథకాల పురోగతిని వారు సమీక్షించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు