రాజ్‌భవన్ టెలిఫోన్ దుర్వినియోగం

21 Jan, 2015 12:38 IST|Sakshi
రాజ్‌భవన్ టెలిఫోన్ దుర్వినియోగం

* సీ సిప్ పరిజ్ఞానంతో చొరబడిన దుండగులు
* ఈ లైన్‌ను వినియోగించి విదేశాలకు ఫోన్ కాల్స్
* అధికంగా ఒమన్, శ్రీలంకలకు వెళ్లినట్లు గుర్తింపు
* లోతుగా ఆరా తీస్తున్న పోలీసులు
* ఉగ్రవాదం, అక్రమ రవాణా కోణాల్లో దర్యాప్తు

 
 శ్రీరంగం కామేష్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అధికారిక కార్యాలయం రాజ్‌భవన్ ఫోన్‌లైన్ దుర్వినియోగమైంది. అత్యంత కీలకంగా భావించే ఈ నెట్‌వర్క్‌లోకి అక్రమంగా చొరబడిన దుండగులు భారీగా విదేశాలకు ఫోన్లు చేశారు. వీటిలో అత్యధికం ఒమన్, శ్రీలంక దేశాలకు చెందినవి కావడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డిని ఇటీవల స్వయంగా కలిసిన నరసింహన్ ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. కీలకాంశం కావడంతో దీనిపై కేసు నమోదు చేసుకున్న తెలంగాణ సీఐడీ అధికారులు ఉగ్రవాదం, అక్రమ రవాణా కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తోపాటు ఆయన కార్యాలయానికి సంబంధించిన ఉన్నతాధికారులూ పని చేస్తుంటారు. వీరంతా ఫోన్లు చేసుకోవడానికి వీటిలో ప్రధాన కనెక్షన్లను విస్తరిస్తూ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ ఆటోమేటిక్ బ్రాంచ్ ఎక్స్‌ఛేంజ్ (ఈపీబీఎక్స్) బాక్సుల్ని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర విభజన అనంతరం గవర్నర్ కార్యాలయంలో సలహాదారులు సహా ఇతర అధికారుల సంఖ్య పెరిగింది.
 
  దీంతో రాజ్‌భవన్‌తోపాటు దానికి సమీపంలోనే ఉన్న మరో భవనంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో గవర్నర్ సలహాదారులతోపాటు కొందరు కీలక అధికారులూ నివసిస్తున్నారు. ఈ కార్యాలయం ఏర్పాటు కావడానికి ముందు రాజ్‌భవన్‌కు ఒకే ఈపీబీఎక్స్ బాక్సు ఉండేది. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌కు కొత్తగా కనెక్షన్లు ఇవ్వడం కోసం అందులో మరో బాక్సు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దీన్ని ఏర్పాటు చేసిన రాజ్‌భవన్ సాంకేతిక సిబ్బంది ప్రధాన ఈపీబీఎక్స్ బాక్సు నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చేందుకు గవర్నర్ కార్యాలయంలో తవ్వకాలు జరిపి వైరు వాడేందుకు సుముఖత చూపకుండా వైఫై పరిజ్ఞానంతో అనుసంధానించారు.

ప్రధాన బాక్సుకు బీఎస్‌ఎన్‌ఎల్ కనెక్షన్ ఉండగా అదనంగా ఏర్పాటు చేసిన దానికి బీమ్‌టెల్ కనెక్షన్ ఆధారంగా వైఫైతో అనుసంధానించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో ఉండే అధికారులు తమ సెల్‌ఫోన్‌తోనూ ఈ లాండ్‌లైన్ ఆధారంగా కాల్స్ చేయడం కోసం ఇటీవల అందుబాటులోకి వచ్చిన సీ-సిప్ అనే యాప్‌ను వినియోగించారు. దీన్ని తమ సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకునే అధికారులు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తోపాటు ఈపీబీఎక్స్ ఐపీ అడ్రస్‌ను పొందుపరచడం ద్వారా సెల్‌ఫోన్‌తో కాల్ చేసినా ఆ బిల్లు మాత్రం కార్యాలయానికి సంబంధించిన ల్యాండ్‌లైన్‌కు వచ్చేలా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నాక వినియోగదారులు డిఫాల్ట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను మార్చి గోప్యంగా ఉండేలా వేరేవి ఫీడ్ చేసుకుంటారు. గవర్నర్ కార్యాలయం అధికారులు ఆ పని చేయకపోవడంతో డిఫాల్ట్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్ కొనసాగాయి.
 
  దీన్ని గుర్తించి తమకు అనుకూలంగా మార్చుకున్న దుండగులు రాజ్‌భవన్ ఈపీబీఎక్స్ బాక్స్ ఐపీ అడ్రస్‌ను సైతం సంగ్రహించారు. వీటి ఆధారంగా రూటింగ్ చేసి భారీగా విదేశాలకు కాల్స్ చేసుకోవడానికి దేశవ్యాప్తంగా అనేక మందికి అనుసంధానించారు. రూటింగ్ ద్వారా కాల్ చేసినప్పుడు దీన్ని కనెక్ట్ చేసిన కాల్ అందుకున్న వ్యక్తులకు.... చేసిన వారి నంబర్ కాకుండా వేరే నంబర్ వచ్చేలా చేస్తారు. దీన్ని వినియోగించుకున్న వ్యక్తుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తారు. బిల్లు మాత్రం రూటింగ్‌కు వాడిన ఫోన్ (రాజ్‌భవన్) యజమానికి వస్తుంది. గవర్నర్ కార్యాలయం టెలిఫోన్ బిల్లు గత నెల్లో రూ.5 లక్షల వరకు రావడంతో బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు విషయాన్ని గవర్నర్ ద ృష్టికి తెచ్చారు. దీనిపై అంతర్గత విచారణ జరపగా ఈ విషయం వెలుగు చూసింది.
 
 ఆ కాల్స్ నేపథ్యంలో అప్రమత్తం...
 సాధారణంగా ఇలాంటి కాల్స్‌ను దుండగులు అసాంఘిక కార్యకలాపాల కోసం వినియోగిస్తుంటారు. విదేశాల నుంచి రూటింగ్ ద్వారా కాల్స్‌ను అందుకున్న భారత్‌కు చెందిన వారిలో అనేక మంది బంగారం వ్యాపారులు ఉన్నట్లు తేలింది. దీంతో బంగా రం అక్రమ రవాణా వ్యవహారాల కోసం ఈ కాల్స్‌ను వాడి ఉంటారని అనుమానిస్తున్నారు. మరోపక్క గవర్నర్ కార్యాల యం నంబర్ వినియోగించి రూటింగ్ ద్వారా మాట్లాడిన అంతర్జాతీయ కాల్స్‌లో శ్రీలంక, ఒమన్‌ల నుంచి కాల్స్ ఉండటంతో కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు అప్రమత్తమయ్యారు.
 
  శ్రీలంకలో ఉన్న లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ) ఉగ్రవాదులకు ఒమన్ సహా మరికొన్ని దేశాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కార్యాలయం ఫోన్‌కు ట్యాపింగ్, నిఘా ఉండదనే కారణంగా దీన్ని వారు వినియోగించారా? అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. దుండగులు వినియోగించిన సీ-సిప్ యాప్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ డిఫాల్ట్ అయినప్పటికీ రాజ్‌భవన్‌కు చెందిన ఈపీబీఎక్స్ బాక్సు ఐపీ అడ్రస్ వారికి ఎలా చేరిందనేది కీలకంగా మారింది. ఈ కేసుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన తెలంగాణ పోలీసులు అనేక విభాగాల సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు