‘కత్తి మహేష్‌పై జీవితకాల నిషేధం విధించాలి’

9 Jul, 2018 15:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్‌పై ఆరు నెలల నిషేధం సరిపోదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. గృహనిర్బంధంలో ఉన్న స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు ఉప్పల్‌ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌తో పాటు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా రాజాసింగ్‌ మాట్లాడుతూ... హైదరాబాద్‌ నుంచి శాశ్వతంగా కత్తి మహేష్‌ను బహిష్కరించాలని, జీవితకాలం పాటు నిషేధం విధించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలుగా స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వస్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదని, దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దళితుల పేరుతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

అక్బరుద్దీన్‌పై ప్రభుత్వానికి పట్టదా?
స్వామి పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఖండించారు. కత్తి మహేష్‌ను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ప్రభుత్వానికి పట్టదా అని ప్రశ్నించారు. స్వామిజీ శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర చేస్తామంటే ఎందుకు నిర్బంధించారని నిలదీశారు. కాగా, స్వామి పరిపూర్ణానందను కలిసేందుకు వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు సినీ నటి కరాటే కల్యాణిని కూడా పోలీసులు అడ్డుకున్నారు.

చదవండి :
పరిపూర్ణానంద నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత!

కత్తి మహేశ్‌పై బహిష్కరణ వేటు!

కత్తి మహేశ్‌ను అందుకే బహిష్కరించాం: డీజీపీ

మరిన్ని వార్తలు