ఆ కుటుంబాన్ని వెంటాడుతున్న డెంగీ

2 Nov, 2019 02:18 IST|Sakshi

గుడిమల్ల రాజయ్యకూ డెంగీ నిర్ధారణ

నాలుగు రోజుల శిశువుకు తగ్గిన ప్లేట్‌లెట్స్‌

కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లిన సోనీ పెద్ద కొడుకు శ్రీవికాస్‌

మంచిర్యాల టౌన్‌: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీశ్రీనగర్‌కు చెందిన గుడిమల్ల రాజయ్య కుటుంబాన్ని డెంగీ భూతం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే డెంగీ వల్ల రాజయ్య కొడుకు గుడిమల్ల రాజగట్టు, కోడలు సోనీ, మనవరాలు శ్రీవర్షిణి కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కొద్ది రోజుల క్రితం రాజయ్య రక్తాన్ని వైద్య సిబ్బంది సేకరించి పరీక్షించగా డెంగీ పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం తనకు డెంగీ సోకిన విషయం కూడా తెలియని రాజయ్య.. తన నాలుగు రోజుల మనవడితోపాటు పెద్ద మనవడు శ్రీవికాస్‌ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటికే ఆందోళనలో ఉన్న గుడిమల్ల కుటుంబ సభ్యులు.. శ్రీవికాస్‌కు శుక్రవారం మధ్యాహ్నం కడుపు నొప్పి రావడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆ బాలుడు ఆరోగ్యంగానే ఉన్నా.. ఎప్పుడు ఏమవుతుందోనని కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

చిన్నారికి తగ్గిన ప్లేట్‌లెట్స్‌ 
సోనీ డెంగీతో చనిపోవడానికి ఒక్కరోజు ముందు జన్మించిన చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో పుట్టినరోజు నుంచే ఐసీయూలో ఉంచారు. నాలుగు రోజుల ఆ చిన్నారిని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా శుక్రవారం ఆ చిన్నారికి సైతం ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోవడంతో వెంటనే ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించాలని వైద్యులు సూచించారు. దీంతో వారు దాతల సహకారం కోరగా, రామకృష్ణాపూర్‌కు చెందిన సురేశ్‌ ప్లేట్‌లెట్స్‌ అందించడానికి ముందుకొచ్చాడు. రెడ్‌క్రాస్‌ సొసైటీ వారు సైతం సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 12 వేల విలువైన ప్లేట్‌లెట్స్, ఎఫ్‌ఎఫ్‌పీలను ఉచితంగా అందించి, ఆ చిన్నారికి ఆసరాగా నిలిచారు.

మరిన్ని వార్తలు