ఓటు నమోదుకు మరో అవకాశం

26 Feb, 2019 03:04 IST|Sakshi

మార్చి 2, 3 తేదీల్లో ప్రత్యేక శిబిరాలు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. దీనికోసం వచ్చే నెల 2, 3 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్‌ బూత్‌లో ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించనుంది. స్థానిక బూత్‌స్థాయి అధికారులు(బీఎల్‌వో) పోలింగ్‌ బూత్‌ల వద్ద అందుబాటులో ఉండి ఓటర్ల నమోదుకు దరఖాస్తు లు స్వీకరించనున్నారు. ఈ నెల 22న రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ–2019లో తమ పేర్లు ఉన్నాయో.. లేదో.. తెలుసుకునేందుకూ అవకాశం కల్పించింది. ఇందుకోసం స్థానిక పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన ఓట రు జాబితాను అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఈ శిబిరాలను నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌ తెలిపారు.

2019 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వ్యక్తులు ఓటరుగా నమోదు కావడానికి ఫారం–6 దరఖాస్తులను అక్కడికక్కడే పూర్తిచేసి బీఎల్‌వోకు సమర్పించాలని అన్నారు. ఈ శిబిరాల వద్ద ఫారం–6, 7, 8, 8ఏ దరఖాస్తులనూ అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు తమ బూత్‌స్థాయి ఏజెంట్లను శిబిరాల వద్దకు పంపించాలని విజ్ఞప్తి చేశా రు. ఓటరు నమోదుకు సంబంధించి ఫిర్యాదులు, అనుమానాలుంటే 1950 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. రాష్ట్రంలో కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. తుది ఓటర్ల జాబితాతోపాటు అనుబంధ ఓటర్ల జాబితాను లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించనున్నారు. 

మరిన్ని వార్తలు