‘అప్పటి నుంచే అమల్లోకి ఎన్నికల నియమావళి’

27 Sep, 2018 19:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ రద్దయినప్పటి నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శాసనసభ రద్దయిన తర్వాత పాలసీ నిర్ణయాలు ఉండకూడదని తెలిపారు. ఎన్నికలు పూర్తయి.. కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకు ఎన్నికల నియామవళి, నిబంధనలు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. అపద్ధర్మ ప్రభుత్వం కొత్త పథకాలు, ప్రాజెక్టులపై ప్రకటన చెయ్యకూడదన్నారు. అలాగే కీలకమైన నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. అనధికారిక పనుల కోసం అధికార యంత్రాగాన్ని వాడుకోరాదని అన్నారు.

రైతు బంధు పథకం అమలుపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనకు పంపామని తెలిపారు. కొత్త పథకాలకు మాత్రమే కోడ్‌ ఉంటుందని తెలిపారు. పాత పథకాల విషయంలో సీఈసీ సలహా తీసుకుంటామని తెలిపారు. వాజ్‌పేయి మెమోరియల్‌ ప్రకటనపై పరిశీలన జరపి నిర్ణయాన్ని తెలుపుతామని అన్నారు. నియోజకవర్గాల పెంపును జాతీయ ఎన్నికల కమిషన్‌ కొట్టివేసిందని.. ఇప్పుడు అది సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. డబ్బులు, మందు పంపిణీ జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. అలాగే ఎన్నికల జాబితాలోని తప్పులను సరిచేశామని.. తమకు వచ్చిన ఫిర్యాదులను కూడా పరిష్కరిస్తున్నామని అన్నారు. క్షేత్ర స్థాయిలో 90 శాతం పనులు  పూర్తయ్యాయని.. హైదరాబాద్‌లోనే కొద్దిపాటి పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు