పెద్ద మొక్కలు అందుబాటులో ఉంచాలి

22 Dec, 2019 03:44 IST|Sakshi

స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ తివారీ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: హరితహారంలో భాగంగా నాటేందుకు వీలైనంత పెద్ద మొక్కలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఆదేశించారు. ఇప్పటికే నాటిన మొక్కలు చనిపోయిన చోట్ల పెద్ద మొక్కలతో వెంటనే మార్పు చేయించాలని, ఈ విషయంలో నోడల్‌ అధికారుల పర్యవేక్షణ కచ్చితంగా ఉండాలని, వారే బాధ్యత తీసుకోవాలని సూచించారు. త్వరలో రెండో విడత పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం అరణ్య భవన్‌లో తెలంగాణకు హరితహారం రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ, సమన్యయ కమిటీ సమావేశంలో హరితహారం అమలు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. మొదటి విడత పల్లె ప్రగతి జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితిని జిల్లాల వారీగా అధికారులు ఆరాతీశారు. నాటిన మొక్కలు బతికిన శాతం, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ, రానున్న రోజుల్లో నీటి సౌకర్యం, రక్షణ చర్యలు, రానున్న సీజన్‌లో నాటాల్సిన మొక్కల కోసం నర్సరీల్లో ఏర్పాట్లపై చర్చించారు.  ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రస్తుతం గ్రీనరీ బాగుందని, మరింతగా పచ్చదనం ఔటర్‌ చుట్టూ పెరిగేలా హెచ్‌ఎండీఏ దృష్టి పెట్టాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ సూచించారు. సమావేశంలో పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి, అదనపు పీసీసీఎఫ్‌ ఆర్‌.ఎం.డోబ్రియల్‌తో పాటు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు