వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

2 Aug, 2014 02:16 IST|Sakshi
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

చండ్రలగూడెం (కారేపల్లి):  అదనపు కట్నం కోసం భర్త, అత్త, మరిది వేధిస్తుండడాన్ని తాళలేని ఓ వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కటుంబీకులు తెలిపిన ప్రకారం.. చండ్రలగూడెం గ్రామానికి చెందిన కోటకొండ రవికి, నల్లగొండ జిల్లా కోదాడ పట్టణం బంజర కాలనీకి చెందిన రాజేశ్వరి(24)కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. రాజేశ్వరి తల్లిదండ్రులు వివాహ సమయంలో లక్ష రూపాయల కట్నంతోపాటు ఇతర లాంఛనాలు ఇచ్చారు. రాజేశ్వరిని భర్త రవి, అత్త పద్మ, మరిది కోటేష్ కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.
 
ఆమెను గురువారం రాత్రి భర్త రవి తీవ్రంగా కొట్టాడు. ఆమె శుక్రవారం ఉదయం తన తల్లి వెంకాయమ్మకు ఫోన్ చేసి.. ‘‘అమ్మా.. నన్ను తీసుకపోండి. రాత్రి బాగా కొట్టారు..’’ అని రోదించింది. అదే రోజున, ఊరి సమీపంలోగల స్వంత వ్యవసాయ బావిలో ఆమె దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న భర్త రవి.. బావిలో దూకి, రాజేశ్వరి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చి, దగ్గర్లోని పొల్లాల్లో పనిచేస్తున్న రైతులకు చెప్పాడు. అదే సమయంలో, బిడ్డను తీసుకెళ్లేందుకని తల్లి వెంకాయమ్మ కోదాడ నుంచి ఖమ్మం చేరుకుంది. ఆమెకు అల్లుడు రవి ఫోన్ చేసి, రాజేశ్వరి మృతిచెందిన వార్త చెప్పాడు. వెంకాయమ్మ బావి వద్దకు వచ్చి, కూతురు మృతదేహంపై పడి రోదించింది. రాజేశ్వరి-రవి దంపతులకు ఐదేళ్ల వయసున్న కవలలైన ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 
భర్తే చంపాడని పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన
రాజేశ్వరిని ఆమె భర్త రవి చంపి బావిలో పడేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ రాజేశ్వరి మృతదేహంతో ఆమె బంధువులు కారేపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసుల అదుపులో ఉన్న రవిని బయటకు పంపాలని డిమాండ్ చేశారు. నిందితుడిని చట్టపరంగా శిక్షిస్తామని పోలీసులు నచ్చచెప్పడంతో వారు శాంతించారు. అనంతరం, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. తల్లి వెంకాయమ్మ ఫిర్యాదుతో ఎస్‌ఐ బి.మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు