ప్రారంభమైన ‘ఫాస్టాగ్‌ కార్‌ పార్కింగ్‌’

18 Nov, 2019 04:21 IST|Sakshi
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఫాస్టాగ్‌ రీడర్లు

దేశంలోనే తొలిసారిగా శంషాబాద్‌ విమానాశ్రయంలో ఏర్పాటు

శంషాబాద్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఫాస్టాగ్‌’ కార్‌ పార్కింగ్‌ విధానం ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో నగదు రహిత లావాదేవీలతోపాటు కాలయాపన లేకుండా పర్యావరణ హితంగా మొత్తం ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ‘ప్యాసింజర్‌ ప్రైమ్‌’లో ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్‌ విమానాశ్రయంలో దీనిని ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) సహకారంతో దీనిని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఐసీఐసీఐ ఫాస్టాగ్‌లతో ప్రారంభమవుతున్న ఈ ప్రక్రియ క్రమంగా ఇతర బ్యాంకులకు విస్తరించనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్‌జీకే కిశోర్‌ మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ద్వారా కార్ల పార్కింగ్‌ సులభతరం కానుందన్నారు. డిజిటలైజేషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియ కాలుష్యాన్ని నివారించడంతోపాటు పర్యావరణ సుస్థిరతకు దోహదం చేస్తుందని తెలిపారు. తమకు భాగస్వాములుగా చేరిన ఎన్‌పీసీఐకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇలా ఉపయోగించుకోవాలి..  
‘ఫాస్టాగ్‌ కార్‌ పార్కింగ్‌’ను ఉపయోగించుకోవడానికి రీలోడబుల్‌ ఎలక్ట్రానిక్‌ ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌ ఉంటుంది. ఈ ట్యాగ్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఉంటుంది. వినియోగదారులు ముందుగా ఈ ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ ఫాస్టాగ్‌ను సదరు వినియోగదారుడి ప్రీపెయిడ్‌ బ్యాంకు ఖాతాకు లింక్‌ చేస్తారు. ట్యాగ్‌ ఖాతా యాక్టివేట్‌ అయిన తర్వాత దానిని కారుకు సంబంధించిన విండ్‌ స్క్రీన్‌పై అమర్చుకోవాలి. ప్రయాణికులు, వినియోగదారులు పార్కింగ్‌కు వచ్చినపుడు లావాదేవీల కోసం ఆగకుండా ఈ ట్యాగ్‌ నుంచి ఆటోమేటిక్‌గా చెల్లింపులు పూర్తవుతాయి. ఈ విధానాన్ని సబ్‌స్క్రైబ్‌ చేసిన వాహనదారులు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా క్రెడిట్, డెబిట్‌ కార్డులను ఉపయోగించకుండా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వీటి కోసం పార్కింగ్‌ వెళ్లే చోట, నిష్క్రమణల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు