‘స్వగృహాలు’ కావాలంటే ధర కోట్ చేయండి

13 Jan, 2015 00:07 IST|Sakshi
‘స్వగృహాలు’ కావాలంటే ధర కోట్ చేయండి

టీఎన్‌జీఓలకు ఈ-వేలం ఆఫర్
సీఎస్ ఆధ్వర్యంలో జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలో నిర్ణయం
అవి ఆమోదయోగ్యంగా ఉంటాయో లేవో  అప్పుడు చెబుతారట
ప్రభుత్వపరంగా ధర నిర్ణయించకుండా దోబూచులాట
సాధారణ ప్రజలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్లనే వర్తింపు


సాక్షి, హైదరాబాద్: ఓ ప్రాజెక్టుకు మంచి డిమాండ్ ఉన్నప్పుడు వేలం నిర్వహించటం కద్దు. ఓ ప్రభుత్వ భూమి కోసం నలుగురైదుగురు పోటీ పడుతున్నప్పుడు ఎవరెక్కువ ధర చెల్లించేందుకు ముందుకొస్తే వారికి కేటాయించేందుకు ఆక్షన్ నిర్వహించిన దాఖలాలున్నాయి. కానీ కొనేవారు లేక దాదాపు రెండేళ్లుగా తెల్ల ఏనుగుల్లా మూలుగుతున్న ‘రాజీవ్ స్వగృహ’ ఇళ్లను వేలం ద్వారా అమ్మాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించటం చర్చనీయాంశంగా మారింది.

సాధారణ ప్రజలు కొనాలంటే మాత్రం ప్రస్తుతం అమలులో ఉన్న ధరే చెల్లించాలని, టీఎన్‌జీఓలకు రాయితీ ధరలకు వాటిని అమ్మనున్నట్టు ఇటీవల ముఖ్యమంత్రి చె.చంద్రశేఖరరావు ప్రకటించిన నేపథ్యంలో... వారికి వేలం పద్ధతిలో అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీ ధరలపై ఓ నిర్ణయం తీసుకునేందుకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన రాజీవ్‌స్వగృహ ఉన్నతస్థాయి కమిటీ సమావేశమైంది.

ధర వెల్లడించొద్దు...
రాజీవ్ స్వగృహ ఇళ్ల ధరలను కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం తగ్గించింది. ఎస్కలేషన్ పేర కాంట్రాక్టర్లకు గతంలో దాదాపు రూ.100 కోట్లను అదనంగా చెల్లించిన నేపథ్యంలో ఆ భారాన్ని కొనుగోలుదారులపై మోపేందుకు 2013 డిసెంబరులో గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల ధరలను  పెంచారు. దీంతో ఇటీవల ధరలను స్వల్పంగా తగ్గించినా కొనుగోలుదారులకు పెద్దగా ప్రయోజనం లేదు. ఇదే సమయంలో టీఎన్‌జీవోలకు రాయితీధరలకు ఇళ్లను కేటాయించనున్నట్టు సీఎం ప్రకటించడంతో హైలెవల్ కమిటీ సోమవారం భేటీ అయింది.

టీఎన్‌జీవోలు చదరపు అడుగు ధర రూ.1500 వరకు ఉండేలా సవరించాలని కోరుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది.అంతతక్కువ ధర నిర్ణయిస్తే ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లనున్నందున అంతకంటే ఎక్కువ ధర ఉండాలని ఇందులో అభిప్రాయపడ్డారు. ఆ ధర ఎంత అనే విషయంపై ముం దుగా ఓ నిర్ణయానికి రావటం కంటే, టీఎన్‌జీఓలు వాస్తవంగా ఎంత ధర పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారో పరిశీలించాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఈ-వేలం ద్వారా ఇళ్లను అమ్మనున్నట్టు ప్రకటన ఇచ్చి, వారిని దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తారు.

బండ్లగూడ, పోచారం ప్రాజెక్టులకు ఈ వెసులుబాటు కల్పించారు. కొనాలనుకునే టీఎన్‌జీఓ సభ్యులు స్వయంగా ఇళ్లను పరిశీలించి, మార్కె ట్ ధరలను తెలుసుకొని ఆ ఇంటికి ఎంత ధర పెట్టాలనుకుంటున్నారో ఈ-వేలం ద్వారా కోట్ చేసేలా సూచించాలని పేర్కొన్నారు. అలా వచ్చే కొటేషన్లను పరిశీలించి ఆ ధరలు ఆమోదయోగ్యంగా ఉన్నాయో లేవో పరిశీ లించి సీఎం ముందుంచనున్నారు. ఈ విధానా న్ని టీఎన్‌జీఓలకు మాత్రమే వర్తింపజేస్తారు. ఆ ధరలు ఆమోదయోగ్యం కాని పక్షంలో ప్రభుత్వపరంగా స్వగృహకు ‘రాయితీ’లు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బ్యాంకు లోన్లు, వాటికి చెల్లిస్తున్న వడ్డీలు తడిసిమోపెడైన నేపథ్యంలో తక్కువ ధరలను ఖరారు చేస్తే స్వగృహపై భారం పడి తీవ్ర నష్టాలు వాటిల్లుతాయని అధికారులు సీఎస్ దృష్టికి తెచ్చారు. 

కేటాయించిన భూములకు గాను  ‘స్వగృహ’ నుంచి రుసుము వసూలు చేయరాదని నిర్ణయిస్తే ధరలను తగ్గించేందుకు వెసులుబాటు ఉంటుందని అభిప్రాయపడ్డారు. దానికి సీఎం నుంచి ఆమోదం వస్తేనే ఇళ్లను తక్కువ ధరలకు ఖరారు చేయనున్నారు. ఈ-వేలానికి సంబంధించి పక్షం రోజు ల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సాధారణ ప్రజలు మాత్రం ఇళ్లను కొనాలంటే అధికారులు ఇప్పటికే నిర్ధారించిన ధరలే వర్తిస్తాయని అధికారులు తేల్చారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు