ఇదేం దా‘రుణం’!

5 Nov, 2018 06:53 IST|Sakshi

ఖమ్మంమయూరిసెంటర్‌: ఉపాధి చూసుకునేందుకు, ఆర్థిక స్వావలంబన పొందేందుకు సబ్సిడీ రుణాలిచ్చి చేయూతనిచ్చే రాజీవ్‌ యువశక్తి పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. మూడు సంవత్సరాలుగా దీనిద్వారా ఎలాంటి రుణాలు మంజూరు చేయట్లేదు. అసలు..దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో పథకం ఏర్పాటు చేశారా? లేక కొనసాగిస్తారా? యువజనుల పరిస్థితి ఏంటి..? అనే అంశాలపై స్పష్టత కరువైంది. రుణాలు పొంది బాగుపడుదామనుకున్న అర్హులు..తీవ్ర నిరాశ చెందుతున్నారు. యువజన సర్వీసుల శాఖ (సెట్‌కమ్‌) నిర్వీర్యమైంది. లోన్లు ఇచ్చి సొంత వ్యాపారం పెట్టించే, బతుకుదెరువు చూపించే రాజీవ్‌ యువశక్తి పథకం ద్వారా చివరిసారిగా 2014–15 లో జిల్లాలోని 296 మంది నిరుద్యోగులకు రూ.2.77 కోట్ల రుణాలను 30శాతం సబ్సిడీపై మంజూరు చేశారు.

ఆ తర్వాత మూడేళ్లుగా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి లోన్లు కేటాయించలేదు. యువజ న సర్వీసుల శాఖతోపాటు క్రీడల విభాగాన్ని కూడా అనుసంధానం చేసి డీవైఎస్‌వోగా మార్చారు. దీంతో యువత కొత్త రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన శాఖ ద్వారా రుణా లు అందుతాయని ఆశించినా ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో రాజీవ్‌యువశక్తి పథకం ఉందో లేదో తెలియని అయోమయం నెలకొంది. అన్నివర్గాల నిరుద్యోగ యువతకు అండగా నిలిచే శాఖ నుంచి పథకాలు తీసేస్తే తమ పరిస్థితి ఏంటని యువత ప్రశ్నించుకుంటున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆపై చదువులు పూర్తిచేసి, ఉద్యోగాలు లేని అనేకమంది యువత సెట్‌క మ్‌ ద్వారా అందించే రుణాల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు ఆ శాఖ చడీచప్పుడు లేకుండా పడిఉంది.

జీఓ వచ్చినా రుణాలు రాలే.. 
2016–17 ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సున్న నిరుద్యోగ యువతకు మూడు విభాగాలుగా సబ్సిడీ కోటాను పెంచింది. స్కీమ్‌–ఏ కింద 7వ తరగతివరకు చదివిన నిరుద్యోగులకు రూ.లక్ష వరకు లోను మంజూరు చేస్తారు. దీనికి 80శాతం సబ్సిడీ ఉంటుంది. స్కీమ్‌–బీ కింద పదో తరగతి విద్యార్హతపై నిరుద్యోగులకు రూ.2లక్షల రుణం ఇచ్చి, 70శాతం సబ్సిడీని వర్తింపజేయాలి. స్కీమ్‌–సీ కింద డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు రూ.5లక్షల వరకు 60శాతం సబ్సిడీపై రుణం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జీవో జారీ అయినా..నేటికీ మార్గదర్శకాలు రాలేదు. నిరుద్యోగులకు వెతలు తప్పట్లేదు.

నిరుద్యోగుల్లో తీరని వేదన.. 
స్వామి వివేకానంద స్ఫూర్తితో యువతను చైతన్య పరచడంతో పాటు వారిలోని కళను వెలికితీయడం, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సబ్సిడీ రుణాలు అందించాలన్నది ప్రధాన ఉద్దేశం. అందుకోసమే ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖను ఏర్పాటు చేసింది. అయితే ఏ లక్ష్యంతో దీనిని ప్రారంభించారో ఆ శాఖ నుంచి నిరుద్యోగులకు అవసరమైన సాయం మాత్రం అందట్లేదు. కేవలం యువతలోని కళలను మాత్రమే ప్రొత్సహిస్తున్న యువజన సర్వీసుల శాఖ నిరుద్యోగులకు మాత్రం ఉపాధి అవకాశాలు కల్పించలేట్లేదు. ప్రభుత్వ శాఖను క్రీడలశాఖలో విలీనం చేసి, రెండు శాఖలకు ఒకే అధికారిని నియమించింది. దీంతో నిరుద్యోగులు, యువజన సంఘాలు, కళాకారులతో కళకళలాడే యువజన సర్వీసుల శాఖ గత రెండు సంవత్సరాల నుంచి వెలవెలబోతోంది. ఈ శాఖ నుంచి తమకు సాయం అందదని నిరుద్యోగులు నిరాశలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు