ఆన్‌లైన్‌లో అనుబంధం

9 Aug, 2014 00:24 IST|Sakshi
ఆన్‌లైన్‌లో అనుబంధం

ఒకప్పుడు రాఖీ పండుగ అంటే.. రాఖీ కొనాలి... దానిని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించేందుకు సెంటర్‌కు వెళ్లడం, కవర్లు కొనడం వంటి ఇబ్బందులు ఉండేవి. ఇంత చేసినా చిరిగిపోకుండా ఆత్మీయులైన సోదరులకు రాఖీలు అందుతాయా, అదీ సమయానికి చేరుతాయా, లేదా అనే అనుమానాలతో అక్కాచెల్లెళ్లు మధనపడేవారు. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు ఆన్‌లైన్ ద్వారా రాఖీలు పంపించే పద్ధతి అందుబాటులోకి వచ్చేసింది.

కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక్క క్లిక్ ద్వారా నిర్ణీత చిరునామాకు రాఖీ చేరిపోతుంది. జిల్లా, రాష్ట్రం, దేశం, విదేశాల్లో ఎక్కడికైనా రాఖీ పంపించే సౌకర్యాన్ని పలు వెబ్‌సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో వరంగల్ నగరంలోని పలువురు మహిళలు, యువతులు ఈసారి తమ సోదరులకు ఆన్‌లైన్‌లో రాఖీలు పంపించేందుకు సిద్ధమయ్యారు.

 షాపుల్లో మాదిరిగానే...
 రాఖీలు అమ్మే షాప్‌నకు వెళ్తే వేల రకాలు.. బంగారు, వెండి రాఖీలు ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిందే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో అన్ని రకాలు ఉంటాయా, లేదా అనే బెంగ కొందరికి ఉంది. కానీ ఆన్‌లైన్‌లో కూడా వేల సంఖ్యలో రకాల రాఖీలు అందుబాటులో ఉంచడంతో మహిళలు, యువతులు ఈసారి ఇంటర్నెట్ రాఖీకే తమ ఓటు అంటున్నారు. దీంతో ఈ సారి నగరం నుంచి సుమారుగా 10వేల మందికి పైగానే తమ సోదరులకు ఆన్‌లైన్ ద్వారా రాఖీలు పంపించనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.

 వేల రకాలు
 తక్కువ నాణ్యత గల వజ్రాలు పొదిగిన రాఖీ, బంగారు పూతతో చేసిన రాఖీ, ముత్యాల జర్దోసి రాఖీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఆన్‌లైన్‌లో కూడా వెయ్యికి పైగా రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. ఇక చిన్నపిల్లల మనస్సు దోచే చోటా బీమ్, మిక్కీ మౌస్, యాంగ్రీ బర్డ్స్ బొమ్మలతో కూడిన రాఖీలకు కొదువే లేదు. రూ.300 నుంచి రూ.10వేల వరకు ధరలో విభిన్న రాఖీలు ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి.

 గిఫ్ట్‌లూ రెడీ..
 సోదరులు ఇష్టపడే బహుమతులను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి నగర మహిళలు
 మొగ్గుచూపుతున్నారు. కేవలం రాఖీతో సరిపెట్టుకోకుండా డ్రై ఫూట్స్‌తో చేసే స్వీట్లను
 కూడా ఆర్డర్ చేసే వెసులుబాటును సైట్లు కల్పిస్తున్నాయి. ఇంకా బ్రేస్‌లెట్లు,
 పర్‌ఫ్యూమ్‌లు, కుర్తాలు, వాచీలను కూడా బహుమతిగా పంపించాలని
 సోదరీమణులు సైట్లను వెతికేస్తున్నారు. ఇక రాఖీ పంపిన సోదరీమణుల కోసం
 సోదరులు వజ్రాభరణాలు, చీరలు, వాచీలు, బ్యాగులు, టెడ్డీబేర్‌లు..
 ఇత్యాది బహుమతుల (రిటర్న్ గిఫ్ట్)ను పంపించేందుకు సిద్ధమయ్యారు.
 వీటికి కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేస్తుండడంతో ఈసారి రాఖీ పండుగ
 మొత్తం ఆన్‌లైన్‌లో సాగే అవకాశం కనిపిస్తోంది.
 రాఖీలు లభించే కొన్ని సైట్లు
 www.onlinerakhigifts.com
 www.sendrakhizonline.com
 www.rakhisale.com
 www.amazon.in
 www.rakhi.rediff.com
 www.flipkart.com
 www.snapdeal.com

>
మరిన్ని వార్తలు