ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా 10న మహా తిరంగా ర్యాలీ

8 Jan, 2020 02:09 IST|Sakshi

ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

సాక్షి, హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టికకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ నగరంలో మహా తిరంగా ర్యాలీ, భారీ బహిరంగ సభ, మానవహారానికి ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు నిచ్చింది. మంగళవారం ముస్లిం మత పెద్దలు దారుస్సలాంలో సమావేశమై ఐక్య కార్యాచరణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముస్లిం మత పెద్దలతో కలసి ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కార్యాచరణకు సంబంధించిన 3 అంశాలను ప్రకటించారు. ఈ నెల 10వ తేదీ శుక్రవారం ప్రార్థనల అనంతరం పాతబస్తీలోని ఈద్గా మిరాలం నుంచి శాస్త్రీపురం వరకు పాదయాత్రతో మహా తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీ అనంతరం శాస్త్రీపురంలో భారీ బహిరంగ సభ చేపడతామన్నారు.

25న చార్మినార్‌ వద్ద భారీ బహిరంగ సభ–ముషాయిరా జరుగుతుందన్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే చార్మినార్‌ ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 30వ తేదీన గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని మహ్మద్‌లైన్‌ ఆయిల్‌ మిల్‌ నుంచి బాపూఘాట్‌ వరకు మానవహారం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. సీఏఏ, ఎన్‌ఆర్సీల వ్యతిరేక కార్యాచరణకు కన్వీనర్‌గా జస్టిస్‌ చంద్రకుమార్, కో కన్వీనర్లుగా జీవన్‌కుమార్, విమలను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. కేరళ మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రతి సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని, సీఎం కేసీఆర్‌ను కూడా కలసి విజ్ఞప్తి చేశామన్నారు.

మరిన్ని వార్తలు