విజయవాడ ఏమైనా నార్త్‌ కొరియానా? 

29 Apr, 2019 13:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విజయవాడలో మీడియా సమావేశం పెట్టకుండా తనను పోలీసులు అడ్డుకోవడంపై ప్రముఖ సీనీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. ఏపీని పోలీస్ రాజ్యంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సమావేశం పెట్టడానికి వీల్లేదు అంటే ఆంధ్రప్రదేశ్ లోకి రాకూడదు అని అర్థమా? విజయవాడ ఏమైనా నార్త్ కొరియానా? ఏపీకి రావాలంటే మేం వీసాలు తీసుకోవాలా? అని వర్మ ప్రశ్నించారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఏయిర్‌ పోర్ట్‌ సెక్యూరిటీతో సంబంధంలేదని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఏ అధికారంతో తనను ఏయిర్‌ పోర్ట్‌లో ఆపారని వర్మ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడుతూ.. ఏపీలో ప్రెస్‌ మీట్‌కు కూడా అనుమతి ఇవ్వడం లేదంటే..మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా? లేక నియంతృత్వ రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. 

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా ప్రమోషన్‌ కోసం ప్రెస్‌ మీట్‌ పెడతానంటే పర్మిషన్‌ ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావట్లేదన్నారు. సినిమా గురించి ఇప్పటికే అంతా చెప్పానని, కొత్తగా చెప్పేది ఏమి లేదన్నారు. ‘సినిమా ప్రమోషన్‌ కోసం ఎవరిని అడిగినా పర్మిషన్‌ లేదంటున్నారు. పై అధికారులతో మాట్లాడతాం అంటే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. పై నుంచి ఆదేశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో ప్రెస్‌ మీట్‌ పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా? లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మే 1న విడుదల అవుతంది. మేం ఎలా ప్రమోషన్‌ చేసుకోవాలి?  ఏపీకి రావాలంటే వీసా తీసుకోవాలా?’ అని వర్మ ప్రశ్నించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా