మిడిమిడి జ్ఞానంతో అసత్య ప్రచారం చేస్తున్నారు

3 Jan, 2020 13:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నాయకులు మిడిమిడి జ్ఞానంతో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అసత్య ప్రచారం చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ అన్నారు. ప్రతిపక్ష నాయకుల బుర్రలోకి సరైన సమాచారం పోలేదని విమర్శించారు. పౌరసత్వ చట్టం ఎందుకు వ్యతిరేకిస్తున్నారో వాళ్లకే తెలియట్లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పౌరసత్వ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 130 కోట్ల భారతీయ ప్రజలకు దీనితో సంబంధం లేదని పేర్కొన్నారు. మతపరమైన కారణాలతో పౌరసత్వం రద్దు చేయరని స్పష్టం చేశారు.

పొరుగు దేశం నుంచి భారత్‌కు వచ్చేవారి కోసమే ఈ చట్టాన్ని రూపొందించారని రాంమాధవ్‌ తెలిపారు. ఈ లెక్కన సోనియా గాంధీకి భారత పౌరసత్వం ఇవ్వలేదా అని ప్రశ్నించారు. చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లకు వాస్తవాలు తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం మన దేశ బాధ్యతగా అభివర్ణించారు. దివంగత నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రయత్నం చేయలేదని గుర్తుచేశారు. కానీ నేడు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు