ర్యాంకు రెండు.. అయినా ఉద్యోగం రాలేదు

1 Feb, 2020 02:59 IST|Sakshi
తల్లితండ్రులతో రామకృష్ణ

దివ్యాంగుడు కాదంటున్న టీఎస్‌పీఎస్సీ.. అవునంటున్న సరోజిని ఆస్పత్రి

సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు వీడియో ద్వారా దివ్యాంగుడి విజ్ఞప్తి

దోమ: దివ్యాంగ కోటాలో జిల్లాలో రెండో ర్యాంకు సాధించాడు.. ఇక ఉద్యోగంలో చేరడమే తరువాయి అనుకున్న ఓ దివ్యాంగుడికి ఇప్పటివరకు ఉద్యోగం లభించలేదు. వివరాలు.. వికారాబాద్‌ జిల్లా దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ ముదిరాజ్‌ టీఆర్టీ–2017 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దివ్యాంగ కోటాలో జిల్లాలోనే మెరిట్‌ ప్రకారం రెండో ర్యాంకులో నిలిచాడు. రెండు నెలల కిందట టీఎస్‌పీఎస్సీ ఎంపిక చేసిన టీఆర్టీ జాబితాలో తన పేరు లేకపోవడంతో రామకృష్ణ మనోవేదనకు గురయ్యాడు.

తనను ఎందుకు ఎంపిక చేయలేదని బోర్డును ప్రశ్నించగా.. ‘ఒక కన్ను చూపు లేదని దివ్యాంగ ధ్రువపత్రం సమర్పించావు. అది తప్పు అని తేలింది. చూపు బాగానే ఉందని హైదరాబాద్‌లోని సరోజిని ఆస్పత్రి వైద్యులు మాకు నివేదిక ఇచ్చారు’అని బోర్డు వివరణ ఇచ్చిందన్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేయలేమని బోర్డు తెలపడంతో సరోజిని ఆస్పత్రిని రామకృష్ణ సంప్రదించగా.. దివ్యాంగుడే అని నివేదిక ఇచ్చామని ఆస్పత్రి వర్గాలు చెప్పాయన్నాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక జరిగిన ఘటనను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు విన్నవిస్తూ వీడియో తీసి శుక్రవారం సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు.

మరిన్ని వార్తలు