హలీమ్‌.. వియ్‌ వాంట్‌ యూ..

18 May, 2020 08:57 IST|Sakshi

హోమ్‌మేడ్‌ హలీమ్‌కు జై అంటున్న కొందరు

కొత్త దారులు అన్వేషిస్తున్న హలీమ్‌ లవర్స్‌

హోమ్‌చెఫ్స్‌ను ఆశ్రయిస్తున్న వారు కొందరు

హలీమ్‌...రంజాన్‌ సీజన్‌లో నగరవాసులను మురిపించే వంటకం. లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఏడాది దీన్ని మిస్సవుతున్నామని చాలా మంది ఫీలవుతున్నారు. కొందరు డైహార్డ్‌ హలీమ్‌ ఫ్యాన్స్‌ మాత్రం మిస్సయ్యే ఛాన్సే లేదంటూ కొత్తదారులు వెతుక్కుంటున్నారు. హోమ్‌ చెఫ్స్‌ను సంప్రదిస్తూ హోమ్‌ మేడ్‌ హలీంను రుచి చూస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ కొందరు హలీమ్‌ను విక్రయిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో 

సాక్షి, హైదరాబాద్‌ : అరబ్‌ పర్షియన్‌ ప్రాంత మూలాలున్న వంటకమైనప్పటికీ స్థానిక ముడిదినుసులు, సుగంధ ద్రవ్యాలతో హైదరాబాదీ హలీమ్‌ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలోనే జియోగ్రాఫిక్‌ ఇండికేషన్‌(జిఐ) సర్టిఫికెట్‌ అందుకున్న తొలి మాంసాహార వంటకం హైదరాబాద్‌ హలీమ్‌. దేశవిదేశాలకు సైతం హలీమ్‌ ఎగుమతులు  చేస్తున్న మన నగరంలో 50ఏళ్లుగా హలీమ్‌ లభించని తొలి ఏడాది ఇదే. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది హలీమ్‌ తయారు చేయబోమని ది హైదరాబాద్‌ హలీమ్‌ మేకర్స్‌ అసోసియేషన్‌(హెచ్‌హెచ్‌ఎమ్‌ఏ), ట్విన్‌ సిటీస్‌ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్లు ప్రకటించాయి. హలీమ్‌ను అందించే దాదాపు 6వేల రెస్టారెంట్స్, ఫుడ్‌ జాయింట్స్‌ ఇవన్నీ కలిపి ఈ ఏడాది రూ.500 కోట్ల విలువైన హలీమ్‌ విక్రయాలను కోల్పోయినట్టు అంచనా. (లాక్‌డౌన్‌: తీవ్ర నిరాశలో హలీమ్‌ ప్రియులు)

రంజాన్‌ పండుగ గురించి ముస్లిం సమాజం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ సమయంలో మాత్రమే అందుబాటులోకి వచ్చే హలీమ్‌ గురించి హైదరాబాద్‌ మొత్తం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏడాదికి ఒకే ఒక్కసారి తమను పలకరించి జిహ్వలను పులకరింపజేసే హలీమ్‌ కోసం ఏడాది మొత్తం వెయిట్‌ చేసే ఫుడ్‌ లవర్స్‌ ఆశలపై ఈ సారి కరోనా నీళ్లు చల్లింది. మొత్తం మీద పండుగ ముగిసే సమయంలో ఫుడ్‌ డోర్‌ డెలివరీకి ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో హలీమ్‌ ఫ్యాన్స్‌కు ఊపొచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏం నిర్ణయిస్తుందో వేచి చూడాలి. అంతమాత్రాన సిటిజనులు పూర్తిగా హలీమ్‌కు దూరంగా లేరని సమాచారం. లాక్‌డవున్‌ టైమ్‌లో హలీమ్‌ హంటర్స్‌ ఏం చేశారు? ఓ రౌండప్‌.. 
 – సాక్షి, సిటీబ్యూరో 

హోమ్‌ చెఫ్స్‌.. హలీమ్‌ రెడీ.. 
మరోవైపు ఎలాగైనా హలీమ్‌ తినాల్సిందే అన్నట్టు ఆరాటం చూపే వారి కోసం నగరంలో కొందరు హలీమ్‌ తయారీదార్లు, హోమ్‌చెఫ్స్‌ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. బంజారాహిల్స్‌కు చెందిన ఓ హోమ్‌చెఫ్‌ ఈ నెల 15 నుంచి హలీమ్‌ విక్రయించడానికి నిర్ణయించగా, పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని రోజుకు కనీసం 30 ఆర్డర్లు సర్వ్‌ చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్‌ వరకూ డెలివరీ చేస్తున్నట్టు తెలిపారు. వీరిలో కొందరు అదనపు ఛార్జీలతో డోర్‌ డెలివరీ చేస్తుండగా మరికొందరు కస్టమర్లే వచ్చి తీసుకెళ్లాలని కోరుతున్నారు. కాస్త పేరున్న వారి దగ్గర కొనాలంటే ఒక హలీమ్‌ రూ.300.. అదే ఫ్యామిలీ ప్యాక్‌ అయితే రూ.1000 ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది. అలాగే హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న ఫుడ్‌ జాయింట్‌ కొన్ని రోజులుగా హలీమ్‌ తయారు చేసి 3 కి.మీ పరిధిలో అందిస్తోంది. రోజుకు 40 కిలోల దాకా మటన్‌ హలీమ్‌ను విక్రయిస్తున్నట్టు సమాచారం. (మోదీపై విషంకక్కిన అఫ్రిది: పెను దుమారం)

మార్కెట్‌ ఉండాలే గానీ మార్గాలనేకం.. 
కొందరు ఇన్‌స్ట్రాగామ్‌ అకౌంట్స్‌ ద్వారా కస్టమర్లకు చేరువవుతుంటే చాలామంది మౌత్‌ టాక్‌ ద్వారానే బిజినెస్‌ చేస్తున్నారు. కొన్ని రోజులుగా హలీమ్‌ విక్రయిస్తున్న టోలీచౌకికి చెందిన మహిళా చెఫ్‌ తాను నగదు చెల్లింపులను అంగీకరించడం లేదన్నారు. అపరిచితులు తనకు వేరే మార్గాల ద్వారా ముందస్తు చెల్లింపు చేస్తేనే సరుకు అందిస్తామన్నారు. కొన్ని హోటళ్లు బాహాటంగానే తమ ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ప్రచారం చేస్తూ హలీమ్‌ను అందిస్తున్నాయి. పైగా తమకు ఎస్సెన్షియల్‌ సర్వీసెస్‌ పాస్‌ ఉందంటోంది. అయితే వంటకాలు తయారు చేసి విక్రయాలు జరపడం చట్టవ్యతిరేకమని తాజాగా హలీమ్‌ విక్రయించిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న మొఘల్‌పురా పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఎక్కడ పడితే అక్కడ హలీమ్‌ కొనడం ప్రమాదకరమని నగరానికి చెందిన పిస్తాహౌజ్‌ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. నగరంలో అత్యధిక కేసులు నమోదైన జియాగూడ నుంచే వీరిలో ఎక్కువ మంది జంతు మాంసం కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. (తల్లికి కరోనా.. ఐసోలేషన్‌లోకి నటుడు )

ఇల్లే పదిలం..
ఈ నేపథ్యంలో పలువురు హలీమ్‌ ప్రియులు ఇంట్లోనే హలీమ్‌ను తయారు చేసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. ‘ఏటేటా హలీమ్‌ను మిస్సవ్వకుండా టేస్ట్‌ చేసేవాళ్లం. అయితే ఈ ఏడాది కుదరకపోవడంతో ఇంట్లోనే తయారు చేసుకున్నాం. చాలా బాగా కుదిరింది’ అని చెప్పారు నగరానికి చెందిన రాజేశ్వరి కరణమ్‌. హలీమ్‌ పట్ల ఇంట్లో ఉండే మగవారి ఇష్టం తెలిసున్న కొందరు మహిళలు కష్టపడి నేర్చుకుని మరీ అందిస్తున్నారు. ‘మా అమ్మాయి ఈ ఏడాది నా కోసం మటన్‌ హలీమ్‌ చేసి పెట్టింది చాలా అద్భుతంగా అనిపించింది’ అంటూ యూసఫ్‌గూడలో నివసించే రాంబాబు వర్మ ఆనందం వ్యక్తం చేశారు. తనకెంతో ఇష్టమైన హలీమ్‌ని ఈ సారి మిస్‌ అవకూడదని కష్టపడి యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానని, తాను చేసిన చికెన్‌ హలీమ్‌ని ఇంటిల్లిపాదీ ఆస్వాదించారని చందానగర్‌ వాసి డేనియల్‌ అంటున్నాడు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు