‘ఖాకీ కావరం’పై విచారణ

7 Mar, 2017 02:34 IST|Sakshi
‘ఖాకీ కావరం’పై విచారణ

స్పందించిన రామగుండం సీపీ

సాక్షి, పెద్దపల్లి: రాత్రిపూట పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన దళిత దంపతులను అవమానకర రీతిలో దూషించడంతోపాటు స్టేషన్‌కు తరలించి చితక్కొడుతూ పోలీసులు సాగించిన దౌర్జ న్యంపై ఉన్నతాధికారులు స్పందించారు. పెద్దపల్లి జిల్లా లోని బొంపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ‘ఖాకీ కావరం’ పేరిట ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనంపై రామగుండం పోలీసు కమిషనర్‌ విక్రంజిత్‌ దుగ్గల్‌ విచారణకు ఆదేశించారు. పెద్దపల్లి ఏసీపీ, ఐపీఎస్‌ అధికారి సి.హెచ్‌.సింధూశర్మను విచార ణాధికారిగా నియమించారు. ఘటనకు కారకుడైన ధర్మారం ఎస్సై హరిబాబును హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

ఖాకీ కావరం

దాడి ఘటనపై బాధితురాలు అరికెల్ల శ్యామల తన ముగ్గురు పిల్లలతో కలసి పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ అలగు వర్షిణితోపాటు దుగ్గల్‌ను వేర్వేరుగా కలసి గోడు వెళ్లబోసుకున్నారు. ‘కేసులా ఉన్నావ్‌’ అంటూ ఎస్సై హరిబాబు తనపై చేసిన వ్యాఖ్యలపై నిలదీసినందుకు తన భర్త దేవేందర్‌ను చిత్రహింసలకు గురిచేశారని వివరించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా మహిళా అధికారి (డీబ్య్లూవో) పద్మావతిని కలెక్టర్‌ ఆదేశించగా ఏసీపీతో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని దుగ్గల్‌ పేర్కొన్నారు. మరోవైపు బాధితురాలు శ్యామలను పౌరహక్కుల సంఘం నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు. బాధ్యులైన ఇద్దరు ఎస్సైలను సస్పెండ్‌ చేయాలని దుగ్గల్‌ను కలసి డిమాండ్‌ చేశారు. పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా బాధిత కుటుంబం, బంధువులు రాస్తారోకో చేసినందుకు 16 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి బాధితురాలు శ్యామలను పరామర్శించారు.

సీఎం సీరియస్‌..!
‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందించినట్టు తెలిసింది. దళిత దంపతులపై దాడి చేసిన పోలీసులపై ఆయన సీరియస్‌ అయినట్టు సమాచారం. పెద్దపల్లి సబ్‌ డివిజన్‌ పోలీసు విభాగంలో ఏం జరుగుతుందో నివేదిక ఇవ్వాల్సిందిగా ఇంటలిజెన్స్‌ ఐజీ నవీన్‌చంద్‌ను సీఎం ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం.

 

మరిన్ని వార్తలు