ఫైలు అటకెక్కింది.. రామప్ప గోడ కూలింది

3 Dec, 2017 01:50 IST|Sakshi

ప్రఖ్యాత ఆలయ ప్రహరీ విషయంలో కేంద్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యం 

జూన్‌లోనే ప్రమాదాన్ని గుర్తించిన స్థానిక అధికారులు 

మరమ్మతుకు అనుమతి కోరుతూ ప్రతిపాదన 

స్పందించని యంత్రాంగం.. వర్షాలకు ప్రాకారం ధ్వంసం 

హైకోర్టు నిలదీయడంతో పునర్‌ నిర్మాణానికి ఏర్పాట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత రామప్ప దేవాలయం విషయంలో కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధికారుల నిర్లక్ష్యంతో భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. గత ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు ఆలయ ప్రహరీ గోడ దాదాపు 40 మీటర్ల మేర కుప్పకూలింది. మరో 30 మీటర్ల మేర ఏ క్షణంలోనైనా కూలేలా తయారైంది. పత్రికల్లోని వార్తలను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ప్రశ్నించటంతో రూ.2 కోట్లతో పునర్‌ నిర్మించేందుకు ఏఎస్‌ఐ అధికారులు సిద్ధమయ్యారు. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ హోదా కోసం యునెస్కోకు ప్రతిపాదించిన నేపథ్యంలో మరింత స్పష్టంగా దరఖాస్తు సమర్పించేందుకు యునెస్కో కన్సల్టెంట్, ప్రఖ్యాత నర్తకి, ఆర్కిటెక్ట్‌ చూడామణి నందగోపాల్‌ బృందం అధ్యయనం జరిపిన మూడు రోజులకే గోడ కూలడం గమనార్హం. జూన్‌లోనే ఏఎస్‌ఐ రాష్ట్ర సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఆర్కియాలజిస్ట్‌ మిలన్‌ చౌలే స్థానిక అధికారులతో కలసి ఆలయాన్ని పరిశీలించారు. అప్పుడే ప్రహరీ కూలే స్థితిలో ఉందని, అత్యవసరంగా మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ కేంద్ర కార్యాలయానికి ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే సకాలంలో దాన్ని పరిశీలించక పెండింగులో పెట్టినట్లు సమాచారం. 

మళ్లీ పాత పద్ధతిలో మరమ్మతులు.. 
ఈ ఆలయం శాండ్‌బాక్స్‌ టెక్నాలజీతో కాకతీయుల కాలంలో నిర్మితమైంది. ప్రహరీ నిర్మాణంలోనూ అప్పట్లో ప్రత్యేక విధానాన్ని అనుసరించారు. దాదాపు మీటరున్నర మేర పునాదిపై గోడను నిర్మించారు. గోడను వెలుపల, లోపల భాగంలో రెండు పొరల చొప్పున నిర్మించి మధ్యలో ఓ మీటర్‌ మేర ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఇసుక నింపి పైభాగంలో అడ్డురాళ్లతో అనుసంధానించారు. ఇప్పుడు అదే పద్ధతిలో దాన్ని పునర్‌ నిర్మించారు. ఇప్పుడు ఆ రెండు గోడ పొరల మధ్య ఇసుక బదులు ఇటుకలు వాడాలని వరంగల్‌ నిట్‌ సూచించటంతో ఆ ఇటుకల తయారీకి ఏఎస్‌ఐ ఆర్డరిచ్చింది. ఇసుక రాతిని వినియోగిస్తారు. మధ్యలో సిమెంటు బదులు డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, రాతిపొడి, గుడ్డుసొనల మిశ్రమాన్ని వినియోగించనున్నారు. ఈశాన్యం వైపు మరో 30 మీటర్ల గోడ ప్రమాదకరంగా మారటంతో దాన్ని కూల్చేసి తిరిగి నిర్మించనున్నారు. ఇందుకు దాదాపు రూ.2 కోట్ల వరకు ఖర్చవుతుందని తాజాగా అంచనా వేశారు. ఈ మేరకు డీపీఆర్‌ సిద్ధం చేసి కేంద్ర కార్యాలయానికి పంపారు. 

మరిన్ని వార్తలు