కనుడు.. కనుడు..రామాయణ గాథ..

14 Mar, 2019 02:34 IST|Sakshi

స్టాంపుల్లో రామాయణం

తెలంగాణకు చెందిన మదురై పోస్టుమాస్టర్‌ జనరల్‌ వినూత్న ప్రయత్నం

రామాయణ ఘట్టాలతో కూడిన వివిధ దేశాల 450 స్టాంపుల సేకరణ

లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు.. త్వరలో గిన్నిస్‌ దృష్టికి..

సాక్షి, హైదరాబాద్‌: రామాయణాన్ని తపాలా బిళ్లల ద్వారా చెప్తే ఎలా ఉంటుంది.. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా తపాలాశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఇదే ప్రయత్నం చేశారు. రామాయణ గాథను ఆది నుంచి అంతం వరకు తపాలా బిళ్లల ద్వారా కళ్ల ముందుకు తెస్తున్నారు. పైగా అవన్నీ 20 వివిధ దేశాలు వివిధ సందర్భాల్లో ముద్రించిన రామాయణ ఇతివృత్తంతో కూడిన పోస్టల్‌ స్టాంపులు కావటం విశేషం. కొన్నేళ్ల పాటు శ్రమించి వాటిని సేకరించిన ఆయన పూర్తి రామాయణ గాథను వాటి రూపంలో నిక్షిప్తం చేశారు. ఆయన కృషికి లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కింది. బుధవారం అధికారికంగా నిర్వాహకులు ఈ విషయాన్ని ప్రకటించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుమ్మడవల్లి గ్రామానికి చెందిన వెన్నం ఉపేందర్‌ ఈ ఘనత సాధించారు.     

450 స్టాంపులు.. 80 ఏ–4 పేజీలు!
తమిళనాడులోని మదురైలో పోస్టుమాస్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న ఉపేందర్‌ కొన్నేళ్లుగా రామాయణ ఇతివృత్తంపై వివిధ దేశాలు ముద్రించిన తపాలా బిళ్లలను సేకరించటం ప్రారంభించారు. ఇప్పటివరకు ఆయన 450 స్టాంపులను సమీకరించారు. వాటిని వరుసగా పేరిస్తే ఏ–4 సైజులో ఉండే 80 కాగితాలకు సరిపోతున్నాయి. ఇదే ప్రపంచ రికార్డుగా ఉంది. అంతకుముందు 16 ఏ–4 సైజు షీట్లకు సరిపడా సంఖ్యలో రామాయణ స్టాంపులు సేకరించిన ఇజ్రాయెల్‌కు చెందిన మెల్లమ్‌ అనే వ్యక్తి పేరిట రికార్డు ఉంది. తన వద్ద ఉన్న స్టాంపులతో పలు ప్రదర్శనల్లో రామాయణ గాథను వివరించిన ఉపేందర్‌ పలు పురస్కారాలు సొంతం చేసుకున్నారు. గత డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనలో ఆయన బంగారు పతకం సైతం సాధించారు. జూన్, జూలైలలో సిడ్నీ, సింగపూర్‌లలో జరగనున్న అంతర్జాతీయ ప్రదర్శనలో పాల్గొంటున్నట్టు ఉపేందర్‌ తెలిపారు. 

ఆగ్నేయాసియా దేశాల్లోనే ఎక్కువ
రామాయణ ఇతివృత్తంపై ఉపేందర్‌ 450 స్టాంపులు సేకరిస్తే అందులో భారత్‌కి చెందినవి 15కు మించిలేవు. ఎక్కువగా ఆగ్నేయాసియా దేశాలవే ఎక్కువగా ఉన్నాయి. కంబోడియా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్‌ దేశాలు పెద్ద సంఖ్యలో రామాయణ ఇతివృత్తంపై తపాలా బిళ్లలను విడుదల చేశాయి. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, మయన్మార్‌లతో పాటు జర్మనీలాంటి కొన్ని యూరప్‌ దేశాలు కూడా రామాయణ ఘట్టాలపై స్టాంపులు విడుదల చేశాయి. వీటన్నింటిని ఉపేందర్‌ సేకరించారు.

రామాయణం ఏం చెప్తోంది...
రామాయణం ప్రస్తుత సమాజానికి ఏం చెప్తోంది.. విదేశాల్లో రామాయణానికి ఇస్తున్న ప్రాధాన్యం.. మొత్తంగా రామాయణ గాథను స్టాంపుల ద్వారా వివరిస్తున్నట్టు ఉపేందర్‌ తెలిపారు. మలేసియాలో హికాయత్‌ సేరి రామా పేరుతో రామాయణాన్ని వివరిస్తున్నారని, అక్కడ ప్రధాని ప్రమాణ స్వీకార సమయంలో ఇప్పటికీ రామ పాదాలను ఉంచుతున్నారని, కొన్ని దేశాల్లో రాజులను రామ–1, రామ–2గా పిలుచుకుంటున్నారని.. ఇలాంటి ఎన్నో విషయాలు స్టాంపుల ద్వారా వెల్లడవుతున్నాయని ఆయన చెప్పారు. రామాయణ గాథను వివరించటంతోపాటు స్టాంపుల ద్వారా జనం ముందుకు తీసుకెళ్తున్నందుకు సంతోషంగా ఉందని.. త్వరలోనే ఇది గిన్నీస్‌ దృష్టికి వెళ్లనుందని అన్నారు.

ఉపేందర్‌  

మరిన్ని వార్తలు