రమేష్‌.. బరిలో బహుఖుష్‌!

14 Nov, 2018 09:23 IST|Sakshi
నామినేషన్‌ దాఖలుకు ముందు ప్రతిజ్ఞ చేస్తున్న రమేష్‌

ఖైరతాబాద్‌ నుంచి ఏడోసారి నామినేషన్‌ దాఖలు

గతంలో రాజకీయ దిగ్గజాలపైనే పోటీకి దిగిన వైనం

బంజారాహిల్స్‌: షాబాద్‌ రమేష్‌. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయంటే ముందుగా గుర్తుకువచ్చే పేరు ఇది. ఖైరతాబాద్‌ బడా గణేష్‌ ప్రాంతంలో నివసించే షాబాద్‌ రమేష్‌ ఖైరతాబాద్‌ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. డిసెంబర్‌ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మంగళవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికలు వచ్చాయంటే నామినేషన్‌ వేయడానికి రమేష్‌ ఇంకా రాలేదా అనేంతగా పాపులర్‌ అయిపోయారు. ప్రతీ ఎన్నికల్లోనూ మొట్టమొదటి నామినేషన్‌ ఆయనే వేస్తారు. ఈసారి కూడా ఆ సంప్రదాయం కొనసాగిస్తూ మొదటి నామినేషన్‌ సమర్పించారు.

1994 ఎన్నికల్లో అప్పటి రాజకీయ దిగ్గజం పీజేఆర్‌పై పోటీ చేసి ‘నేను పీజేఆర్‌పైనే పోటీ చేశా’నంటూ గర్వంగా చెప్పుకొన్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయరామారావుపై పోటీకి నిలిచారు. 2004లో మళ్లీ పీజేఆర్, కేవీఆర్‌లపైనా పోటీచేశారు. పీజేఆర్‌ మరణాంతరం 2008 ఉప ఎన్నికల్లో విష్ణుపై పోటీ చేశారు. 2009లో మాజీ మంత్రి దానం నాగేందర్‌పై, 2014లో బీజేపీ అభ్యర్థి చింతల రాంచంద్రారెడ్డిపైనా పోటీ చేశారు. దిగ్గజాలపైనే పోటీ చేశానని గర్వంగా ఫీలయ్యే రమేష్‌ ఐదేళ్లపాటు గల్లాబుడ్డీలో డబ్బు జమ చేసుకుని నామినేషన్‌ ఫీజుతోపాటు, ప్రచార ఖర్చులకు వాడతారు. నామినేషన్‌ వేసే ముందు భార్య తిలకం దిద్ది, హారతి ఇచ్చి సాగనంపుతుంటే ఇద్దరు కొడుకులు చెరో వైపు బాడీగార్డుల్లా నామినేషన్‌ కేంద్రం దాకా వస్తారు. తాను మరణించేంతవరకూ పోటీ చేస్తునే ఉంటానని ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు