కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగ భద్రత

21 May, 2015 03:31 IST|Sakshi
కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగ భద్రత

ఆదిలాబాద్ రూరల్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లక్ష మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్నా ఏ ఒక్కరికీ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆదిలాబాద్ మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాథోడ్ రమేష్ విమర్శించారు. కేవలం వారి కుటుంబానికే ఉద్యోగ భద్రతను కల్పించుకున్నారని దుయ్యబట్టారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ సెంట్రల్ గార్డెన్‌లో పశ్చిమ జిల్లా మినీ మహానాడు సభ నిర్వహించారు. ముందుగా పార్టీలో కొనసాగి మృతిచెందిన కార్యకర్తలకు రెండు నిమిషాల మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ చౌక్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారని అన్నారు.

తెలంగాణ ప్రజలకు మాయ మాటలు చెప్పి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన కేసీఆర్ ఆయననే సీఎం అయ్యారని దుయ్యబట్టారు. భూమి లేని దళితులకు 3 ఎకరాల వ్యవసాయ భూమిని ఇస్తానని కేవలం నియోజకవర్గానికి ఐదుగురికి అది కూడా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారని విమర్శించారు. యూనివర్సిటీ భూముల్లో ఇల్లు నిర్మిస్తానని ప్రకటించడం సరికాదన్నారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ పథకాలు కేవలం దోచుకోవడానికేనని విమర్శించారు.

జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎదుట 150 రోజులుగా వికలాంగులు ధర్నా కొనసాగిస్తున్నా.. లోకల్ మంత్రి జోగు రామన్న పరామర్శించలేదని పేర్కొన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జిల్లాలో పర్యటించి ఐదు కుటుంబాలకే ఆర్థిక సాయం అందించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆదిలాబాద్‌ను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, ప్రాణహిత చెవేళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్దనే నిర్మించాలని, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు.

సమావేశంలో జిల్లా ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, పశ్చిమ, తూర్పు జిల్లాల అధ్యక్షులు లోలం శ్యాంసుందర్, బోడ జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావ్, సుమన్ రాథోడ్, రాష్ట్ర నాయకుడు యూనుస్ అక్బానీ, నారాయణ్‌రెడ్డి, బాబర్, అబ్దుల్ కలాం, రీతేష్ రాథోడ్, రాజేశ్వర్, ఎడిపెల్లి లింగన్న, నైతం వినోద్, మహిళా కార్యకర్తలు లక్ష్మి, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు