నకిలీ విత్తన మాఫియా స్వైరవిహారం

7 Oct, 2016 03:34 IST|Sakshi
నకిలీ విత్తన మాఫియా స్వైరవిహారం

నియంత్రించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది
వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శ
పలు చోట్ల పంటల పరిశీలన.. రైతులకు ఓదార్పు

 దుగ్గొండి :  రాష్ట్రంలో నకిలీ విత్తన మాఫియా స్వైర విహారం చేస్తుందని, దానిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట తుపాను కారణంగా నేలపాలైందని, చేతికి వస్తుందనుకున్న మిరప పంట నకిలీ విత్తనాలతో నట్టేట ముంచిందన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పత్తి, మొక్కజొన్న పంటలను గురువారం ఆయన   పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. స్థానిక రైతులు ఎరుకల రాజమ్మ, గోలి నాగరాజు, అనుముల రాజిరెడ్డి, పెండ్లి శ్రీను పంటలను పరిశీలించి శ్రీకాంత్‌రెడ్డి చలించిపోయారు.
 
ఎంత పెట్టుబడి పెట్టారు.. వ్యవసాయ అధికారులు ఎవరైనా వచ్చారా.. ప్రభుత్వం నుంచి పరిహారం ఏమైనా అందిందా.. అని  అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టామని, వ్యవసాయాధికారులు ఎవరూ కూడా పంట  చూడటానికి రాలేదని వారు వివరించారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంట పాడై పోయిన విధానాన్ని వివరిస్తూ వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరూ అధైర్య పడవద్దని, రైతాంగానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అన్నదాతలు ఏ పంట చేను వద్ద చూసినా నాటి మహానేత వైఎస్సార్‌నే గుర్తుచేస్తున్నారని చెప్పారు.
 
పంట పోయిన వెంటనే పంట నష్టపరిహారం చెల్లించడం,  విత్తనాలను తక్కువ ధరకు అందించిన విధానాన్ని తెలియజేస్తున్నారన్నారు. నాటి  వైఎస్‌ పాలనలో వ్యవసాయం పండుగగా  మారితే ఆతర్వాత వచ్చిన పాలకులు నిర్లక్ష్యం చేశారని అన్నారు. పంట బాగుంటేనే రైతు పండుగ చేసుకుంటాడని రైతు ఏడుస్తున్న సమయంలో బతుకమ్మ పండుగ వచ్చినా రైతుల్లో ఆ వాతావరణం లేదన్నారు. ప్రభుత్వం మాత్రం జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్‌ల ప్రారంభం  అదరాలని చెప్పడం బాధాకరమన్నారు.
 
పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించి ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శ్రీకాంత్‌రెడ్డి వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, రాష్ట్ర , జిల్లా నాయకులు శివకుమార్, భూపాల్‌రెడ్డి, జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, చల్ల అమరేందర్‌రెడ్డి, దొంతి కమలాకర్‌రెడ్డి, బోయిని రాజిరెడ్డి, మండల నాయకులు నునావత్‌ రమేష్, పుట్టపాక రాజేందర్, ఇజ్జిగిరి కోటిలింగం, కట్టయ్య ఉన్నారు.

మరిన్ని వార్తలు