నా సమావేశానికే రారా?

25 Feb, 2018 01:57 IST|Sakshi

అధికారులపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు రాములు ఆగ్రహం

సిద్దిపేటటౌన్‌/రాయపోలు(దుబ్బాక) : కేంద్ర కేబినెట్‌ స్థాయి కలిగిన తాను దళితుల సమస్యలపై సమీక్షించడానికి వస్తే జిల్లా ఉన్నతాధికారులు రాకపోవడంపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు కె.రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు నా సమావేశానికే రాకపోతే, సామాన్యులకేం న్యాయం చేస్తారు’అని ప్రశ్నించారు. రాములు శనివారం సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కేంద్రం సిద్దిపేటలోని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ భవనం లో దళిత సంఘాలు, నాయకులతో సమావేశమయ్యారు.

వారి సమస్యలపై చర్చించడానికి ఒక్కో విభాగం అధికారి వచ్చారా? లేదా? అని ఆరా తీశారు. 34 శాఖలకు ఇద్దరే అధికారులు వచ్చారని తేలడంతో సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల రెండో వారంలో మళ్లీ వస్తానని చెప్పారు. శనివారం సమావేశానికి రాని అధికారులందరికీ ఢిల్లీ వెళ్లాక నోటీసులు పంపిస్తానని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు