తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా రమజాన్‌ వేడుకలు

16 Jun, 2018 10:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముస్లీంల పవిత్ర పండుగ రమజాన్‌ ను తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. కులమతాలకు అతీతంగా సోదరభావంతో ఒకరికొకరు ఈద్‌ ముబారక్‌ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ముస్లీం ప్రార్థనల కొసం ఈద్గా, మసీదుల వద్ద జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగర మేయర్‌ బొంతు రాంమోహన్‌, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డిలు పండగ శుభాకాంక్షలు తెలిపారు.

మాసబ్‌ ట్యాంక్‌లోని హాకీ గ్రౌండ్‌ వద్ద ముస్లీం సోదరులు నమాజ్‌ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

సనత్ నగర్ రాంగోపాల్ పేట్ నల్లగుట్ట మజీద్లో ఏర్పాటు చేసిన రంజాన్ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రబాద్‌ చిలకలగూడ ఈద్గాలో మంత్రి పద్మారావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

బాన్సువాడలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నల్గొండలోని ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో శాసనమండలి డిప్యూటీ స్పీకర్‌ నేతి విద్యాసాగర్‌, ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విజయవాడ: రమజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిని వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీంలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా రామవరప్పాడు రోడ్డు నిర్మాణంలో తొలగించిన మసీదును ఎందుకు నిర్మించడం లేదంటూ చంద్రబాబును ముస్లీం సోదరులు ప్రశ్నించారు. దీంతో ఏడాది లోపు మసీదు నిర్మిస్తామని సీఎం వారికి హామీ ఇచ్చారు.

కడప: రాయచోటి పట్టణంలోని ఈద్గాలో జరిగిన వేడుకల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి, పార్టీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మరిన్ని వార్తలు